Telugu First News Reader Shanti Swaroop Passed Away: ఇతర ఏ చానళ్లు లేకుండా దూరదర్శన్ ఒకటే ఉన్న రోజుల్లో తొలి తెలుగు న్యూస్‌రీడర్‌గా శాంతి స్వరూప్ చాలా మందికి సుపరిచితులు. ఆయన గురువారం కన్నుమూశారు. గుండెపోటులో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
శాంతి స్వరూప్ 1983 నవంబర్ 14వ తేదీ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు కూడా ఆయన వార్తలు చదివారు. సందర్భానికి తగినట్లుగా వాయిస్ మాడ్యులేషన్ చేయడంలో ఆయనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. చాలా ప్రశాంతమైన స్వరంగా ఆయన వార్తలు చదివేవారు. అందుకనే ఎన్నాళ్లైనా సరే ఆయన ప్రేక్షకుల హృదయాల్లో అలా ఉండిపోయారు.
టెలి ప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లను చూసి బట్టీ పట్టి వార్తలు చదవడంలో శాంతి స్వరూప్(Shanti Swaroop) ఆరితేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్ పేపర్లను బట్టీ పట్టి వార్తలు చదువుతూ వచ్చారు. ఆయనను చూసే తర్వాతి తరాల వారు వార్తలు ఎలా చదవాలి? అనే దాన్ని నేర్చుకున్నారు. తర్వాత తరం న్యూస్‌రీడర్లు అందరికీ ఆయన మార్గదర్శకులుగా ఉన్నారు. వారికి ఆయన ‘వార్తలు చదవకండి… వార్తలు చెప్పండి’ అంటూ సూచించేవారు. అందుకనే చాలా మంది న్యూస్‌రీడర్లు(News Readers) ఆయనను గురువుగా భావిస్తూ ఉంటారు.