తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కాలని భావిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం తాము పట్టు కోల్పోలేదని చెప్పేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. దక్షిణాదికి గేట్వేగా భావిస్తున్న తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కమలదళం 2018లో వచ్చిన ఫలితాలు, ఓట్లు, సీట్ల లెక్కలతో ముందుకు సాగుతోంది.
గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో మంచి ఓటింగ్ లభించింది, ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో ఉన్నామని లెక్కలు తీస్తూ.. అందుకు అనుగుణంగా ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నం, పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. పోయినసారి బీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, బీజేపీ 1, టీడీపీ 2, మజ్లిస్ 7, ఇండిపెండెండ్ ఒక స్థానంలో గెలిచారు. మజ్లిస్ అధికార పార్టీ మిత్రపక్షం కాగా, బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ తన బలాన్ని 103కు పెంచుకుంది. బీజేపీ రెండు ఉప ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని 3కు పెంచుకుంది.
2018లో బీజేపీ 11 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మరికొన్నిచోట్ల రెండో స్థానానికి సమీపంలో నిలిచింది. అయితే 2019లో జరిగిన లోకసభ ఎన్నికల నాటికి ఏకంగా నాలుగు సీట్లను కైవసం చేసుకొని, 21 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆరు నెలల కాలంలోనే బీజేపీ చాలా వేగంగా పుంజుకుంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో దూకుడు మరింత పెరిగింది. నేతల చేరికలు, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు ధీటుగా గెలుపు సొంతం చేసుకుంటోంది. పార్టీకి ఉన్న అంతంత బలానికి, ఆయా నియోజకవర్గాలలోని బలమైన నేతలను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపొందవచ్చుననేది ఢిల్లీ పెద్దల అంచనా. అందుకే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలను తీసుకున్నది.
2018తో పోలిస్తే ఆరు నెలల కాలంలో 21 స్థానాల్లో రెండో స్థానానికి వచ్చిన తమ పార్టీ, బలమైన నేతల కలయిక నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు మెజార్టీకి కావాల్సిన సీట్లకు సమీపంలో ప్రభావం చూపవచ్చునని భావిస్తోంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆర్థిక బలం, ప్రజాబలం కలిగిన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగిస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం చోట్ల బీజేపీకి ఏమాత్రం బలం లేదు. అలాంటిచోట్ల కూడా బలమైన నేతలకు గాలం వేసింది. ఇప్పటికే కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండలో ఉపయోగపడనున్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 లోకసభ ఎన్నికల్లో నాలుగు సీట్లలో గెలిచిన తమ పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపిందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే, మరికొంతమంది నేతలు వస్తారని, అప్పుడు విజయం ఖాయమని దీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను వెనక్కి నెట్టి, భారీగా పుంజుకున్నదని గుర్తు చేస్తున్నారు.
మరి బీజేపీ 2023లో 90 సీట్లను టార్గెట్గా పెట్టుకొని, కనీసం 65 సీట్లలో గెలవాలని చూస్తోంది. మరి 2018 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు తమ బలం వేగంగా పెరిగిందంటూ కమలదళం వేసుకున్న లెక్కలు నిజమవుతాయా? ఆ పార్టీ చేరికల వ్యూహాలు ఫలిస్తాయా? 6 నెలల్లో 21 సీట్లకు పెరిగిన బలం, నాలుగున్నరేళ్లలో 90కి చేరిందా? అన్నది మరో పది నెలల్లో తేలిపోతుంది.