కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ విస్తృతంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లకు (Voters) ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, కానుకలు, మద్యం తరలిస్తారనే అనుమానంతో సరిహద్దుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పోలీసులు వాహనాలు సోదాలు చేస్తున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ నిర్మాత, అలనాటి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ (Boney Kapoor) కారులో విలువైన వెండి వస్తువులు లభించాయి. ఆ కారును సీజ్ చేయడంతో కర్ణాటకతో పాటు బాలీవుడ్ (Bollywood)లో కలకలం రేగింది.
కర్ణాటకలోని దావణగెరె (Davangere) శివారులోని హెబ్బల్ టోల్ సమీపంలో శనివారం ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో బోనీ కపూర్ కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుపై ఉన్న బీఎండబ్ల్యూ కారు వచ్చింది. వాహనంలో తనిఖీలు చేయగా మొత్తం ఐదు బాక్స్ లు కనిపించాయి. ఆ బాక్స్ లు తెరచి చూడగా ఏకంగా 66 కిలోల వెండి గిన్నెలు, చెంచాలు, ప్లేట్లు ఇతర వస్తువులు (Silverwares) కనిపించాయి. వీటి విలువ సుమారు రూ.39 లక్షల దాకా ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్, మరో వ్యవక్తి హరి సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని హరి సింగ్ తెలిపాడు. ఆ వస్తువులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా కారు చెన్నై నుంచి ముంబైకి వెళ్తోంది.