దేశం మొత్తం మీద సినిమా టిక్కెట్ల వివాదం బాగా ముదిరిపోయింది. పుష్ప లాంటి సినిమాలకు టిక్కెట్టు రేట్లు అసాధారణంగా పెంచేసినా సరే సినిమాలో దమ్ముంది కాబట్టి దేశవ్యాప్త సంచలనాన్ని పుష్ప సృష్టించగలిగింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పనికిరాని సినిమాలకు కూడా టిక్కెట్టు రేట్లు పెంచుకుని, తమ గొయ్యి తామే ధియేటర్లవారు గానీ, సదరు చిత్రనిర్మాతలు గానీ తవ్వుకుంటున్నారన్న ఆరోపణ గట్టిగానే వినబడుతోంది. ఆరోపణ అని కూడా అనలేం. ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు భారీ బడ్డెట్టు సినిమాలు కూడా కంటెంట్ ఇంట్రస్టింగ్‌గా లేని కారణంగా నిర్మాతలు, థియేటర్లు కూడా పూర్తిగా నష్టపోయిన సందర్భాన్ని అందరూ చూశారు. టిక్కెట్టు రేటు పెంపు అనే అంశం కూడా ముఖ్యంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాలకే వర్తిస్తుంది తప్పితే చిన్నా చితకా సినిమాలకి కానే కాదు. కానీ ఆ మధ్య రోజుల్లో చూస్తే ఓ మోస్తరు మధ్యతరగతి బడ్జెట్ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచేసుకుని తమ పీక తామే కోసుకున్న అనుభవాలు కూడా పరిశ్రమకి లేకపోలేదు.
ఈ గందరగోళంలో పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 200 రూపాయల కన్నా టిక్కెట్ ధర ఉండడానికి వీల్లేదని ఘంటాపథంగా చెప్పేసింది. ఇదొక రకంగా మల్టీ ప్లెక్స్ థియేటర్ల మాడు పగులగొట్టడం లాంటిదే. పైగా ఎంటర్టైన్ మెంట్ టేక్స్ కూడా ఈ రెండువందల రూపాయలలోనే అని మరో సన్నాయి నొక్కు నొక్కింది కన్నడ ప్రభుత్వం. మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో కూడా ముందు కొన్ని వరసలు తక్కువ టిక్కెట్ ధరలకే విక్రయించాలన్న షరతు ఉన్నప్పటికీ, సదరు యాజమాన్యాలు దాన్ని తుంగలో తొక్కి యధేచ్ఛగా ఎక్కువ రేట్లకే టిక్కెట్లు అమ్ముకుంటూ వ్యవహారాన్ని బహిరంగంగానే నడిపించేస్తున్నాయి. మూలిగే నక్కమీద తాటి పండు పడిందన్నట్టుగా టిక్కెట్ ధరలే మోయలేని భారంగా మారాయి అంటే దానికి తోడు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకుడికి తడిసి మోపెడు అవుతున్న దరిమిలా ప్రేక్షకులు థియేటర్లకి రావడమే మానుకుని ఇంటిపట్టునే ఏ ఓటిటిలోనో లభ్యమైన సినిమాని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల థియేటర్ల రన్ కూడా అమాంతంగా పడిపోయి, చాలా థియేటర్లు మూసుకునే దశలోకి కూరుకుపోయాయి.
దీనికి సంబంధించి పెద్దపెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా. కానీ దానికి ఎక్కడా ఏ కోశాన పరిష్కారమో, లేదా ముగింపో కనుచూపు మేరలో కనిపించడంలేదు. సినిమా బావుండి, ప్రేక్షకులు పరిగెడితే సినిమాలు ఆడుతున్నాయి. అప్పుడు టిక్కెట్ రేట్ ప్రస్తావనికి రావడం లేదు. సినిమాలు చెత్తచెత్తగా తీసేసి రేట్లు పెంచేసుకున్న సందర్భాలలో మాత్రమ ఈ హై టికెట్ రేట్ మాత్రం గొంతు మీద కత్తిలా మారి ట్రేడ్‌కి ఉరి పడినట్టవుతోంది అన్నది ఇటీవల అనుభవాల సారాంశం. కాకపోతే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా సంచలన నిర్ణయం ఎంత వరకూ అమలవుతుంది, కన్నడ పరిశ్రమ దీన్ని ఏ విధంగా అడ్డుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.