»Govt Of India Approved Renaming Of Aurangabad And Osmanabad
Renamed పేర్ల తొలగింపుపై దూకుడు.. మరో రెండు నగరాలకు
‘ఔరంగాబాద్ ఎప్పటికీ మా నగరం. ఇప్పుడు ఔరంగాబాద్ కోసం మా శక్తి ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మా ప్రియమైన నగరం కోసం ఒక భారీ మోర్చా నిర్వహిస్తాం. మా నగరం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ శక్తులను (బీజేపీ) ఓడించడానికి ఔరంగాబాద్ వాసులను సిద్ధం చేస్తాం. పోరాటం కొనసాగిస్తాం’
కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు, నగరాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. గతంలో ఢిల్లీలోని రాజ్ పథ్ (Rajpath) మార్గం పేరును కర్తవ్య పథ్ (Kartavya Path)గా, రాష్ట్రపతి భవన్ లో ఉన్న మొఘల్ గార్డెన్స్ ను అమృత్ ఉద్యాన్ (Amrit Udyan)గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నగరాల పేర్లను మార్చివేసింది. వాటికి ఆధ్యాత్మికతను జోడించింది. గత పాలకుల పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపాడు.
మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలలో ఔరంగాబాద్ (Aurangabad), ఉస్మాబాద్ (Osmanabad) ముఖ్యమైనవి. అయితే ఈ నగరాలకు నాటి పాలకులు ఔరంగజేబు, నిజాం వారసుల పేర్లు ఉన్నాయి. శివసేన చీల్చి అడ్డదారిన బీజేపీ సహాయంతో అధికారంలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ఈ పట్టణాల పేర్లు మారుస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఔరంగాబాద్ ను ఛత్రపతి శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ ను ధరాశివ్ గా పేర్లు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి ఆమోదం అనంతరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తాజాగా ఈ ప్రతిపాదనలను కేంద్రంలోని నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ నగరాల పేర్లు మారుస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పేర్ల మార్పునకు ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం ఏక్ నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపాడు.
కేంద్రం ఆమోదం తెలపడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. హిందూత్వ అజెండాను మోయడం సరికాదన్నారు. బలవంతంగా హిందూత్వాన్ని ప్రజలపై రుద్దుతున్నారని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇక పట్టణాల పేర్ల మార్పును ఏఐఎంఐఎం (AIMIM) తప్పుబట్టింది. ఈ నగరాల పేర్ల మార్పును ఖండించింది. ఎంఐఎం పార్టీ ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ (Imtiyaz Jaleel) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నగరం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘ఔరంగాబాద్ ఎప్పటికీ మా నగరం. ఇప్పుడు ఔరంగాబాద్ కోసం మా శక్తి ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మా ప్రియమైన నగరం కోసం ఒక భారీ మోర్చా నిర్వహిస్తాం. మా నగరం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ శక్తులను (బీజేపీ) ఓడించడానికి ఔరంగాబాద్ వాసులను సిద్ధం చేస్తాం. పోరాటం కొనసాగిస్తాం’ అని ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశాడు.
అయితే ఈ నిర్ణయం తాము తీసుకున్నది కాదని గతంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అధికార పార్టీ తెలిపింది. 29 జూన్ 2022న అప్పటి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు వివరించారు. ఉద్దవ్ రాజీనామాకు ముందు తీసుకున్న నిర్ణయం ఇదేనని పేర్కొన్నారు. కాగా ఆ నగరాలకు మొఘల్ చక్రవర్తి పేరు మీద 17వ శతాబ్దంలో ఔరంగాబాద్ పేరు పెట్టగా.. హైదరాబాద్ చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదుగా ఉస్మానాబాద్ అనే పేర్లు ఆ నగరాలకు ఉన్నాయి. తాజాగా వాటిని మార్చేస్తున్నారు. ఇక మరికొన్ని నగరాల పేర్లు మార్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది.