Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌ను ఈ సమయంలో అస్సలు తినకూడదు.. ఎందుకంటే!
మనం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే తినకూడని సమయాల్లో తింటే అవి కూడా చేటే చేస్తాయంటున్నారు. ఆ సమయాలేంటో అంతా తెలుసుకోవాల్సిందే.
Eat dry fruits: డ్రై ఫ్రూట్స్‌ని రోజు తగిన మోతాదులో తింటూ ఉండటం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటాం. అందుకనే చాలా మంది వీటిని రోజూ తినేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీటిలో మన రోజు వారీ అవసరాలకు సరిపడా ఖనిజాలు, విటమిన్లు మినరళ్లు లభిస్తాయి. అయితే వీటిని సరైన సమయంలో తిన్నప్పుడు మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను మనం చక్కగా అందుకోగలం. తినకూడని సమయాల్లో తింటే వీటి వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలూ లేకపోలేదు. అవేంటో అంతా తెలుసుకుని వీటిని ఏ సమయంలో తినాలనేది ప్లాన్ చేసుకుంటే మేలని పోషకాహార నిపుణులు చెబుతున్నాయి.
ఖర్జూరాలను(Dates) ఖాళీ పొట్టతో అస్సలు తినకూడదు. అంటే ఉదయం అల్పాహారానికి ముందుగాని, సాయంత్రం పొట్ట ఖాళీగా ఉన్న సమయంలోగాని వీటిని అస్సలు తినకూడదు. రోజుకు నాలుగైదు మించి ఎక్కువ తినకూడదు. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే అది రక్తంలో కలుస్తుంది. ఎక్కువగా తింటే రక్తంలో చక్కెరలు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి.
పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కిస్మిస్లను అంతా ఎంతో ఇష్టంగా తినేస్తుంటారు. పరగడుపున వీటిని తినడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో కూడా చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అతిగా తిన్నా, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా తిన్నా రక్తంలో చక్కరలు హఠాత్తుగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇటీవల కాలంలో అంజీర్(fig) పండ్లను, ఎండు అంజీర్‌ని సైతం అంతా ఎక్కువగా తినేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియ సజావుగా జరిగేందుకు తోర్పడుతుంది. అలాగే దీనిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటన్నింటినీ ఖాళీ కడుపుతో తినకూడదని గుర్తుంచుకోవాలి.