పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి హాలులోకి ఎంటర్ కాగానే, అక్కడ తాను తప్ప అందరూ అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటు చేసుకున్నది. ఇక్కడి ఇక్బాల్ కాలేజీ 17 ఏళ్ల విద్యార్థి మనీష్ శంకర్ ప్రసాద్ ఇంటర్ పరీక్ష మ్యాథ్స్ రాయడానికి బ్రిలియంట్ కాన్వెట్ స్కూల్కు వెళ్లాడు. ఎగ్జామ్ హాలులోకి వెళ్లగానే, 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. తానొక్కడే అబ్బాయి. అమ్మాయిలను చూసిన అతను ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. స్కూల్ సిబ్బంది అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి బంధువు ఒకరు మాట్లాడుతూ… హాలులోకి వెళ్లగానే అమ్మాయిలు అందరూ కనిపించడంతో ఇబ్బందిగా ఫీలయ్యాడని, అప్పటికే జ్వరం కూడా వచ్చిందని, దీంతో సొమ్మసిల్లి పడిపోయినట్లు చెప్పారు. విద్యార్థికి సదర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
పరీక్ష హాలులో అందరూ అమ్మాయిల మధ్య, ఒకే అబ్బాయి ఉండటం సాధారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందని మనీష్ శంకర్ ప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సెంటర్ను ఇలా ఎలా అలోకేట్ చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అమ్మాయిలను చూసి అబ్బాయి స్పృహ కోల్పోవడం… అలాగే, అందరూ అమ్మాయిలే ఉండగా, కేవలం ఒకే అబ్బాయి ఉండటం కూడా ఆశ్చర్యకరమే అంటున్నారు. 1 ఫిబ్రవరి, బుధవారం నుండి బీహార్ HSC బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 13 లక్షల 18వేల 227 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. ఇందులో 6 లక్షల 36వే 432 మంది అమ్మాయిలు, 6 లక్షల 81వేల 795 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ పరీక్షలను బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ కమిటీ నిర్వహిస్తోంది.