జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని ఇళ్ల అక్రమ ఆక్రమణల విషయంలో కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇవి ఆక్రమణలు కావని.. తన పార్టీ జనసేన ఆవిర్భావ సభకు ఇక్కడి రైతులు భూములు ఇచ్చారనే దుగ్థతోనే ప్రభుత్వం ఇలా చేసిందని ఆరోపించారు.
ఈక్రమంలోనే ఇక్కడకు వచ్చి ఇప్పటి ప్రజలకు ఓదార్పునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు ఇక్కడ పర్యటనకు అనుమతించని నేపథ్యంలో పాదయాత్రగా వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే, ఆయన ఇక్కడ ప్రజలను పలకరించి..తిరిగి వెళ్తున్న క్రమంలో ఓపెన్ టాప్ కారుపై భాగంలో కూర్చుని గన్నవరం వెళ్లారు. పవన్ కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేశారనే వాదన వినిపించింది.
ఈ నేపథ్యంలో ఆయా అంశాలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. హైవేపై పవన్ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపైనా కేసు పెట్టారు. తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సమాచారం. పవన్‌తోపాటు ఆయన కారు డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం.