అన్నమయ్య: జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం–1994ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో డెకాయ్ ఆపరేషన్లు ఆకస్మికంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
HNK: కాజీపేట పట్టణంలోని మడికొండలో శాంతమ్మ అనే వృద్ధురాలిపై కొడుకు, కోడళ్లు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధురాలికి తల పగిలి, ఎడమ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి కేసు నమోదు చేశారు. వృద్ధులను వేధించడం, కొట్టడం వంటి చర్యలకు కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.
W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆకివీడులో ఎస్ఎఫ్ఏ, ఐద్వా, సీఐటీయూ సంయుక్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఏ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సింధు, టీ. రేష్మ మాట్లాడుతూ.. మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వీటిని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అన్యాయం అన్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని వారు చెప్పుకొచ్చారు.
సత్యసాయి: హిందూపురంలో వైదేహీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవకురాలు డాక్టర్ ఉమా ఆర్యాకు ‘వైద్యో నారాయణ హరి’ పురస్కారం అందజేశారు. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ ఖాన్, బాలాజీ, మనోహర్ ఆమెను దుశ్శాలువతో సత్కరించారు. ఆమె సేవలను కొనియాడారు.
TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో రాబోయే మూడు రోజులు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండలం పసలూరులో సాగుతున్న ఆర్డీఎస్ఎస్ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో అధికారులకు సహకరించాలని గ్రామస్థులకు సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు అదనంగా 90 బృందాలను ఏర్పాటు చేయాలని ఏజెన్సీని ఆదేశించారు.
గుంటూరు: రాజధాని అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం పనులను మంత్రి సవిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్మృతి వనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలోని కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కోసం వచ్చిన హైకోర్టు జడ్జీల చేతుల మీదుగా వికలాంగులకు వీల్ చైర్లను, ట్యాబ్లను కలెక్టర్ అరీమా అగ్రవాల్ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ, సిరిసిల్ల జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిలు, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, న్యాయవాదులు పాల్గొన్నారు.
NRML: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందనీ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మహిళల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసుల ద్వారా పోలీస్ అక్క, నారిశక్తి, శివంగి వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
BDK: టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఐటీడీఏ ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక పాఠశాల ఆవరణంలో నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
PDPL: చిన్న పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కీచులాటపల్లి సర్పంచ్ ఆనంద్ కోరారు. శనివారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఆయన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు.
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌ను తప్పించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. ‘మెక్‌కల్లమ్ కోచ్‌గా కొనసాగాలని మేము 125% కోరుకుంటున్నాము. నేను చూసిన అత్యుత్తమ కోచ్ అతనే. డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అతడిని గౌరవిస్తారు. స్ఫూర్తిగా తీసుకుంటారు’ అని పేర్కొన్నాడు.
SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ శాఖ తరపున ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
KMR: మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా-పత్తి మిల్లులకు వెళ్లే రోడ్డు చాలా ఏండ్లుగా అధ్వానంగా ఉన్న విషయం తెలిసిందే. వార్షాకాలం వచ్చిందంటే ఈ మార్గాన వెళ్లాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో శనివారం ఎట్టకేలకు రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ సంతోష్ తెలిపారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కల్లో గజ్జి, తామర, చర్మం ఊడిపోవడం వంటి వింత వ్యాధి లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న కుక్కలు, ప్రజల మధ్య తిరుగుతుండడంతో.. అవి కరిస్తే ఎలాంటి ప్రమాదం బారిన పడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.