MHBD: డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ యార్డ్‌ను ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్‌తో కలిసి మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మార్కెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
KNR: సహకార భవనంలో సహకార శాఖ ఉద్యోగులకు ఆడిట్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. సహకార శాఖ సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివ నాగేందర్ రెడ్డి ఉద్యోగులకు ఆడిట్ విధానాలు, లెక్కల నిర్వహణ, పారదర్శకత అవసరంపై వివరంగా అవగాహన కల్పించారు. సహకార సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా నిర్వహించేందుకు ఆడిట్ కీలకమని తెలిపారు.
KMR: భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నంపై శనివారం అధికారులు విచారణ జరిపారు. విద్యార్థులకు పురుగులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. దీనిపై విచారణ జరిపించాలని ఎన్సీడీ వైద్యాధికారి శిరీషను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె పాఠశాలకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు.
JGL: ఎండపల్లి మండలం ఉండేడా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ మమత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే గుడ్లు, బాలామృతం సహా అన్ని పోషకాహార పదార్థాలను ప్రతి బాలింతకు, పిల్లలకు సమయానికి అందించాలని సూచించారు. కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఉప సర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు ఉన్నారు.
కోనసీమ: మందపల్లి శనేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పుష్కర నిధుల నుంచి భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న నూతన శాశ్వత అన్నదాన భవనానికి సుమారు రూ.1 కోటి 20 లక్షలు పుష్కర నిధుల నుంచి మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
KDP: అమెరికా సామ్రాజ్య వాదం, ఇజ్రాయిల్ దురాక్రమణ విధానాలతో ఇరాన్‌పై దాడి చేయడం దుర్మార్గమని CPI ML లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం బద్వేలులో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో అమాయకులైన ప్రజలు, చిన్నారులు చనిపోయారన్నారు. స్కూలుపై బాంబు దాడి జరగడంతో 160 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపారు.
ASF: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని సిర్పూర్ (టి)ASI రాములు కోరారు. వెంకట్రావ్ పేట్‌లో శనివారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు రోహిత్, శ్రీనివాస్, సంఘవి ఆటపాటలతో అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిబంధనలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
CTR: సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో వెదురుకుప్పం మండలంలోని వెలుగు కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మోహన్ మురళి, చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల, ఏపీఎం పరుశురాం రెడ్డి తదితరులు పాల్గొని మహిళల సాధికారతపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు మున్సిపాలిటీ 18వ వార్డులో ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ దివాకర పరిశీలించారు. విద్యుత్ లైన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, మిషన్ భగీరథ, ఇరిగేషన్, లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
E.G: రాజమండ్రిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో SC, ST వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. SC, ST వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు.
MBNR: ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం అవుతుందని, ఆ కలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని పదవ డివిజన్ కార్పొరేటర్ రమేష్ బాబు తెలిపారు. శనివారం డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ తూప్రాన్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. పట్టణంలో శానిటేషన్ కార్యకలాపాలను విజయవంతంగా చేపట్టి, ప్రాంతాలను మరింత శుభ్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
ASR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డుంబ్రిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కోరేట్ల విజయ గౌరీ ముఖ్య హాజరై మాట్లాడారు.. మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు కల్పించాల్సిన అవసరం ఉందని, మహిళా చైతన్యంతోనే సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
TPT: తిరుపతిలోని అంకాళమ్మ ఆలయ నూతన పాలకమండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా కొండా రాజ్ మోహన్, సభ్యులుగా మరో ఎనిమిది మంది బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో ఆలయ ఈవో మునిశంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ELR: ఉంగుటూరులో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శనివారం జిల్లా హార్టికల్చర్ అధికారి సాజా నాయక్ పరిశీలించారు. కార్యాలయంలో ఏర్పాట్లు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా చేయవలసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్శనలో ఎంపీడీవో జీయర్ మనోజ్, సురేష్ పాల్గొన్నారు.