MBNR: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా భూత్పూర్ మున్సిపాలిటీలో ఇవాళ పర్యటించారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆమె, ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.
NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా విద్యా వ్యాప్తికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
కృష్ణా: యనమలకుదురు ఆలయంలో హుండీ కానుకల చోరీ జరిగింది. ఈ వ్యవహారంలో అర్చకులు గూడూరు రామలింగేశ్వర విద్యాసాగర్, బాలూరి పూర్ణచందర్రావు, ఆలయ సిబ్బంది కొండ్రాతి రోశయ్యలను పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో అవనిగడ్డ జైలుకు తరలించారు. ఆలయ ఈవో పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.
AP: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దైవాలరావూరు, పమిడిపాడులో విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీలో దాతల సహకారం మరువలేనిదన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.
NZB: ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ వైపు తరలించారు.
BPT: అద్దంకిలోని బస్టాండ్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఇరాన్‌పై దాడులను సాకుగా చూపి సిలిండర్ ధరలను పెంచడం సరికాదని అన్నారు. దీనివలన మధ్యతరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మానేరు వంతెనపై బీజేపీ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమునేని శ్రీధర్ రావు మాట్లాడుతూ.. కాలేశ్వరం 11వ ప్యాకేజీ పనులు వెంటనే పూర్తి చేసి మండలంలోని రైతులకు నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారం రాకముందు అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు మండలంలోని రైతులను పట్టించుకోవడంలేదన్నారు.
SRD: మండల కేంద్రమైన కంగ్టి గిరిజన గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దేవేందర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారంటే అది సావిత్రిబాయి ఆనాడు వేసిన సాహసోపేతమైన పోరాటంతోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సావిత్రిబాయి గురించి వివరించారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను ఎస్సై అనూక్ మంగళవారం పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
SDPT: భూంపల్లి మండల కేంద్రంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల విద్య కోసం ఎంతో కృషి చేసిన మహానీయురాలని కొనియాడారు.
KDP: ఖాజీపేట(M) సర్వఖాన్ పేటలో తాగునీటి మోటర్ వద్ద తీవ్ర అపరిశుభ్రత తాండవిస్తోంది. మోటర్ నుంచి నీరు లీకేజీ అవుతుండటంతో ఆ ప్రాంతమంతా మురుగు మయంగా మారింది. తాగునీరు కలుషితమయ్యే ఆస్కారం ఉందని స్థానికులు పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. మోటర్ నుంచి నీరు లీకేజీ జరగకుండా అరికట్టి సురక్షిత మంచి నీటిని అందించాలని కోరారు.
TG: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తూ.. తాకుతూ వెళ్లింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు పక్కకు వాహనాలను ఆపి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
VZM: రైల్వే ఆర్వోబీలు సేకరించిన అన్ని రకాల భూములకు పరిహారం సమానంగా ఇవ్వకపోతే పోరాటమే శరణ్యమని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం గజపతినగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం అన్ని రకాల భూములకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు లక్ష్మీ, సింహాద్రి పాల్గొన్నారు.
KMR: బాన్సువాడ పట్టణంలోని ప్రధాన ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద పరిస్థితులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. బస్‌స్టాండ్ అవుట్‌గేట్ వద్ద ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు అడ్డంగా నిలబడటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు స్టాండ్ నుంచి బయటకు రావాల్సిన మార్గంలోనే ఆటోలు నిర్లక్ష్యంగా తిరుగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
హర్యానాలోని గురుగ్రామ్ సిధ్రావాలిలో నిర్మాణం జరుగుతుండగా గోడ కూలి ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.