KMM: సత్తుపల్లి మండలం తుమ్మూరు శివారులోని ఒక కోళ్ల ఫారంలో ఆదివారం సుమారు 5,000 కోళ్లు మృతి చెందాయి. మరో రెండు రోజుల్లో చికెన్ దుకాణాలకు పంపించాల్సిన దశలో ఈ సంఘటన జరగడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వర్షాలు తగ్గిన తర్వాత వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలన అనంతరం మాత్రమే దీనిపై స్పందించగలమని తెలిపారు.
GNTR: తెనాలి పురపాలక సంఘ కమిషనర్‌గా మున్సిపల్ ఇంజినీర్ పి. శ్రీకాంత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇదే కార్యాలయంలో ఎం.ఈ.గా పనిచేస్తున్న ఆయనకు కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఉన్న వి.ఎం. లక్ష్మీపతిరావు పదవీ విరమణ చేశారు.
NTR: విజయవాడలో నిరుద్యోగులను మోసం చేస్తున్న స్వర్ణ కుమారి అనే మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మధురా నగర్‌కు చెందిన ఈమె హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నగదు వసూలు చేసింది. గతంలో కూడా అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.
కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో అక్టోబరు నెలకు సంబంధించిన నిత్య కల్యాణ టికెట్స్ విడుదల చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 31 రోజుల 3,596 కల్యాణాలకు ఆన్లైన్లో 2,128, కార్యాలయంలో 1,468 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు నేరుగా లేదా ఆన్లైన్లో కాని నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
CTR: బైరెడ్డిపల్లి మండలం గడ్డిండ్లు గ్రామానికి చెందిన బుజ్జన్న కుమారుడు చంద్రశేఖర్ (27)హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆదివారం యువకుడు స్నేహితులతో కలిసి హంద్రీనీవా కాలువలో స్నానం చేయడానికి వెళ్లాడు. నీటి వేగం ఎక్కువగా ఉండటంతో సుడిగుండంలో చిక్కుకుని ఊపిరాడక చనిపోయాడు. ఇతను గతంలో వాలంటీర్‌గా పనిచేశాడు.
సత్యసాయి: సోమందేపల్లి మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగించినందుకు ఎస్సై రమేష్ బాబును టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల వ్యాప్తంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేశుడి పండుగ, నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ఎస్సై సహకరించారు. ఈ సందర్భంగా కావేటి నాగేపల్లికి చెందిన టీడీపీ యువ నాయకుడు అనిల్ అతని మిత్రబృందంతో కలిసి ఎస్సైను సన్మానించారు.
KNR: సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలతను రాజీపడదగిన కేసుల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ సూచించారు. ఇరుపక్షాల మధ్య చట్టబద్ధంగా వివాదాలను పరిష్కరించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిర్యాది, ముద్దాయి ఇద్దరూ ఇష్టపూర్వకంగా రాజీపడే అవకాశాన్ని వినియోగించుకుంటే సమయంతో పాటు న్యాయ వ్యయాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు.
ASF: పెంచికలపేట మండలం కమ్మర్గాం నుంచి బెజ్జారు వెళ్లే రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ తమ అవసరాల నిమిత్తం ఈ మార్గం గుండా వచ్చివెళ్లే వారికి నరకయాతనగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి,రోడ్డుకు మరమ్మతులు చేయలన్నారు.
NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు రోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సిటీ బస్ టెర్మినల్ నుంచి బస్టాండ్ వెళ్లే మార్గం వద్ద హిజ్రాలు ప్రజలపై చేతులు వేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని ప్రజలు తెలుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారి వెంటపడుతూ.. అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
శ్రీకాకుళం: పశ్చిమ బెంగాల్-ఒడిస్సా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 2 నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
E.G: సారథ్యం యాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, వీర వీరాంజనేయలు కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ఘన స్వాగతం పలికారు. మాధవ్ సారథ్యం యాత్ర లో బాగంగా సోమవారం రాజమండ్రి లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఇవాళ మంత్రి సవిత పర్యటించనున్నట్లు మండల కన్వీనర్ వెంకటేష్ తెలిపారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
BDK: దుమ్ముగూడెం మండలం మంగువాయి బాడవకు చెందిన తుర్రం జ్యోతి, విప్పు పువ్వుతో లడ్డూ, బర్ఫీ, చాక్లెట్, టీ తయారులతో ఆమె గిడుగు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఆమె వినూత్న ఆలోచన 35 మంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు, గిరిజన ఆహార సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
ATP: గుత్తి మున్సిపాలిటిలో వినాయక చవితి వేడుకలు విజయవంతం కావడానికి కృషి చేసిన మున్సిపల్ వర్కర్లను ఇవాళ సన్మానించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మున్సి పల్ వర్కర్లందరూ హాజరు కావాలన్నారు.
కోనసీమ: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని ఈవో నాగవరప్రసాద్ తెలిపారు.