KDP: హోలీ పండుగ సెలవు దినం రేపే అని జిల్లా విద్యాశాఖ అధికారి సంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని ఆయన కోరారు.
KMR: పిట్లం మండలం హస్నాపూర్లో విషాదం నెలకొంది. గ్రామలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతూ రాజు సత్యం (41) సోమవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. అయిజ మండలం యాపదిన్నెకు చెందిన రంగారెడ్డికి వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి LOCని ఆయన సోమవారం అందజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవపల్లె వీధిలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి కె.లక్ష్మమ్మ(67)ను నగల కోసం హత్య చేశారు. గొంతు నులిమి దిండుతో ఊపిరాడకుండా చేసి సుమారు 100 గ్రాముల బంగారం దోచుకెళ్లినట్లు సమాచారం. ఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
BDK: వేములపల్లి రవిశంకర్ గొప్ప వ్యక్తి అని MLA కూనంనేని అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం పట్టణంలో సోమవారం వేములపల్లి రవిశంకర్ దిశాదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై రవిశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SDPT: కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామ బీరప్ప దేవాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా రూ.2 లక్షల వ్యయంతో బోర్ తవ్వించారు. సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
MHBD: జిల్లాలో జనవరిలో జరిగిన టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ (TCC) ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. https://www.bse.telangana.gov.in ద్వారా అభ్యర్థులకు సంబంధించిన పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫలితాల సందేహాలకు 9849761012ను సంప్రదించాలన్నారు.
GNTR: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. ముత్యాలరెడ్డి నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన ఆయన, పారిశుద్ధ్య పనులు నిర్దేశిత పద్ధతిలో జరగాలని, లేనిపక్షంలో సిబ్బందిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలను గుర్తించి జీఎంసీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
TPT: గొల్లవాని గుంటలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియంను శాప్ ఛైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు త్వరలోనే ఈ స్టేడియం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి సోమవారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిస్థితులను, మధ్యాహ్న భోజనం, నీటి సదుపాయం, చెట్ల తొలగింపు వంటి అంశాలను పరిశీలించారు. సమస్యలను అంచనా వేసి, నాణ్యమైన విద్య, భోజనం అందించడానికి తక్షణ చర్యలు తీసుకునే హామీ ఇచ్చారు.
TG: బాన్సువాడలో ఇటీవల జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. BJP జిల్లా కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది పార్టీ పరంగా జరిగిన గొడవ కాదని, ఒక యువతి పట్ల అసభ్యంగా కొందరు ప్రవర్తించారని బాధితులు పేర్కొన్నారు. బాధితులను బెయిల్‌పై బయటకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.
KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల 2025-26 సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అభ్యర్థులు మార్చి 10లోగా తెలుగు విభాగంలో దరఖాస్తులు సమర్పించాలి అని ప్రిన్సిపాల్ కే. రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ సూచించారు. మరిన్ని వివరాలకు తెలుగు విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
NRPT: ఉట్కూర్ మండలం మల్లేపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా శిశు సంక్షేమ శాఖ కౌన్సిలర్ విజయ్ కుమార్ పాల్గొని బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టం వంటి కీలక అంశాలను వివరించారు. బాల్య వివాహాల సమాచారాన్ని వెంటనే 1098 నంబర్‌కు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
PDPL: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు.
NRPT: ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.