NGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని గురువారం జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు.
VKB: బంట్వరం మండల కేంద్రం నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ యమపాశంలా మారింది. దీని చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో నిత్యం పశువులు విద్యుత్ షాక్కు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.
KNR: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, హుజురాబాద్ మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 15, 2వ వార్డుల్లో, మున్సిపల్ పార్కులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురికి కాలువలు, చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర గురువారం ఆవిష్కరించారు. మార్చి 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 16న అంకురార్పణం జరుగుతుందని, మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27–29 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
KNRL: వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు హాజరుకానున్నారు. మండలంలోని 10,679 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6.30 కోట్లు జమ చేయనుంది. రైతు సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని కడప చెన్నై జాతీయ రహదారి మలినేని పట్నం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: ఇందుకూరుపేట మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని దేవిస్ పేట గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
W.G: కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో డోన్లు వినియోగంపై సీఎం చంద్రబాబుకు వివరిస్తూ, మా జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుకు వినియోగిస్తున్నామని, దీనితోపాటు ఎలక్ట్రికల్ లైన్‌లు నిర్మాణానికి డ్రోన్లను పోల్ టు పోల్ వైర్‌ను అందించడానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా వినూత్నంగా ఉందని, నేనెప్పుడూ వినలేదని కలెక్టర్‌ను సీఎం అభినందించారు.
TG: హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు అర్జున్ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్లను ఆయన పరిశీలించారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కలిగి ఉండటం విశేషం.
BHNG: మోత్కూర్ ఎస్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఖదీర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలో ఉన్న ఆయన ఇంటిపై గురువారం ఆకస్మికంగా దాడులు చేసి పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో మోత్కూరులోని ఎస్టీఓ కార్యాలయంలో, భువనగిరి పట్టణంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు.
RR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, నవభారత్ నగర్ కాలనీలలో ముస్లిం సోదర సోదరీమణులకు MLA గాంధీ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
PDPL: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కాలిందిని ఇవాళ ముత్తారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి, విద్యా బోధన, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
MDCL: విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రాయాలని అల్వాల్ సీఐ ప్రశాంత్ తెలిపారు. గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షల కోసం ఉపయోగించే ప్యాడులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో ఇంటి, కుళాయి పన్నుల సమస్యలపై గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. గతేడాది పన్నులు చెల్లించినప్పటికీ, ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఇంటి, నీటి పన్నుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో పలు సమస్యలపై PGRSలో ఫిర్యాదు చేసిన పరిష్కారం లేదన్నారు.