MBNR: ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,054 చెరువులు ఉన్నాయి. 2014లో ఏర్పడిన అప్పటి ప్రభుత్వం నీటి తీరువా పన్ను చెల్లింపుతో పాటు సాగునీటి సంఘాలను రద్దు చేసింది. దీంతో చెరువులు, కాలువల మరమ్మత్తులకు నిధులు కరువయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి సంఘాలను పునరుద్ధరణ చేయనుంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు జరుగుతోందని జిల్లా అధికారులు తెలిపారు.
AP: రాష్ట్రంలో ఇవాళ బ్యాంక్‌లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బ్యాంక్ యూనియన్లు కోరడంతో కనుమ రోజు సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ప్రభుత్వ సెలవుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14న మాత్రమే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు. అయితే, కనుమ రోజు కూడా సెలవు ప్రకటించాలని బ్యాంక్ యూనియన్లు కోరడంతో అదనంగా మరో రోజు కూడా సెలవును పొడిగించారు.
MDK: ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని మంగళవారం రామాయంపేటలోని పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు స్వామివారి బ్రహోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహిస్తున్న పుష్కర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరారు.
ATP: గుంతకల్లు మండలం వెంకటంపల్లి గ్రామ సమీపంలోని కొండపై వెలసిన పెద్ద కదిరప్ప స్వామి రథోత్సవం ఈనెల 19న జరుగుతుందని ఆలయ అర్చకులు రామాంజనేయులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు కదిరప్ప స్వామి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 51 ఉచిత సామూహిక వివాహాలు జరుగుతాయన్నారు.
VSP: సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని కోడిపందేలు నిర్వహించారు. మొగలిపురం, గుల్లేపల్లి, వంగలి తదితర గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే పేకాట, కోడి పందేలు విస్తృతంగా జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో డబ్బులు భారీగా చేతులు మారినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా పోటీలు నిర్వహించారు.
VSP: కనుమ పండుగ పురస్కరించుకొని నర్సీపట్నంలో నాన్ వెజ్ ధరలు పెరిగాయి. మామూలు రోజుల కన్నా కేజీ మీద రూ.20 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. లైవ్ చికెన్ కేజీ రూ.140, స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.260, బోన్ లెస్ చికెన్ కేజీ రూ.300గా అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ.900కు వినియోగదారులు కొంటున్నారు. చేపలు రకం బట్టి కేజీ రూ.150, ఫ్రాన్స్ కేజీ రూ.500గా అమ్ముతున్నారు.
VSP: మునగపాకలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన గుర్రపు పందెం పోటీలను ప్రారంభించారు. ఎడ్ల బండ్ల పరుగు పందెం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు.
VSP: నార్త్ ఇండియా నుంచి వచ్చిన గ్యాంగ్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని కృష్ణదేవిపేట ఎస్ఐ వై.తారకేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఇటీవల దొంగతనాలు ఎక్కువైన నేపథ్యంలో నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు పలు సూచనలు చేశారన్నారు.
W.G: కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ కోడిపందాల బరిలో ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన కోడిపందాలను ఆయన వీక్షించారు. ఈ సందర్బంగా అత్యధిక పందాలు సాధించిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
VSP: మాడుగుల నియోజకవర్గంలో విద్యా సంస్థలు తక్కువగా ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. దేవరాపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు లభించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మాడుగులలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని గరగాలమ్మ దిబ్బ నందు వెంచేసియున్న శ్రీ గరగాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసే ఆశీర్వచనాలు ఇచ్చారు.
VZM: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చిన బంధువులతో మంగళవారం బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో బొంతలకోటి శంకరరావు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పురటాల పోలమ్మ కళా బృందం వారు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
W.G: పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో కోడి పందేల బరి వద్ద జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కాగుతున్న నూనె ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమ్మిశెట్టి గంగాధర్ మంగళవారం రాత్రి గుండాట వద్ద జరిగిన ఘర్షణలో అక్కడే కాగుతున్న నూనెను ఒంటిపై పోసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TPT: సీఎం చంద్రబాబు కు మదనపల్లె పట్టణానికి చెందిన మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బుధవారం నారావారి పల్లెలో చంద్రబాబును కలసిన పఠాన్ ఖాదర్ ఖాన్ వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన నాయకులకు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను మదనపల్లె నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షుడు పెరవలి నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం నారావారి పల్లెలో లోకేష్‌ను కలసిన ఆయన శ్రీవారి నమూనాను అందజేశారు.అనంతరం పెరవలి నవీన్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని లోకేష్ చెప్పారన్నారు.