సత్యసాయి: సోమందేపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి నుంచి వెలగమేకలపల్లి గ్రామం వరకు రూ.1.48 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు బుధవారం కూటమి నాయకులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది.
గుంటూరు: పట్టణంలో బుధవారం పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యనారాయణ పలు పాల కేంద్రాలను తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పాలు విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పాల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి పాల విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.
WNP: పోలీస్ కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలలో ఆర్థిక భరోసా కల్పిస్తూ, సంక్షేమానికి కొత్త వెలుగులు నింపుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ శివకుమార్ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తుంది అన్నారు.
W.G: ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు మరియు అభిషేకాలను నిర్వహించడం జరిగింది.
KMRL బిచ్కుంద పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. Lనిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.
KRNL: ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గు సైడ్ ఫాల్ కావడంతో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నడుము, కాలికి దెబ్బలు తగలడంతో వెంటనే గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYDకు తరలించారు. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
నంద్యాల చిన్నారి పునర్విక వైద్యం కోసం ప్రధాని సహాయ నిధి నుంచి రూ.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందని ఎంపీ డా.బైరెడ్డి శబరి ఇవాళ తెలిపారు. ప్రజా దర్బార్‌లో తల్లిదండ్రుల విజ్ఞప్తిని వినడం ద్వారా ఈ సహాయం సాధ్యమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పునర్విక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు.
ADB: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించాలని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలను అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక అతిముఖ్యమన్నారు.
CTR: పూతలపట్టులో బ్రిడ్జిలు లేక పలువురు మృతి చెందినట్లు ఎమ్మెల్యే మురళీ మోహన్ అసెంబ్లీలో తెలిపారు. భీమా నదిపై బ్రిడ్జి కొట్టుకెళ్లగా, పలు ప్రాంతాల్లో రిపేర్లు చేసిన బ్రిడ్జిలు వర్షాలకు దెబ్బతింటున్నాయన్నారు. ఐరాల MRO కార్యాలయం వద్ద బ్రిడ్జి లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, జయంతి-టేకుమంద, యాదమరి మండలం వరదరాజుపల్లిలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.
NZB : ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు 318 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, మొదటిరోజు విద్యార్థులెవరూ ఆలస్యంగా రాలేదని పేర్కొన్నారు.గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి సంబంధించిన కొత్త గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అగ్రహారం స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీని ఇంఛార్జ్‌కు బుధవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
WNP: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో వనిత జ్యోతి మహిళా సంఘం (NGO) సహకారంతో శ్రీరంగాపురం మండలంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మాట్లాడుతూ..కళాకారుల గుర్తింపు కార్డుల ప్రాధాన్యతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తామని బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ భరోసా కల్పించారు.
MNCL: జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి పట్టణాల్లో నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 16మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 156 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245 మంది విద్యార్థులు ఆరుగురు, దండేపల్లి జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షను రాయలేదు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కరణ్ కోట్ పోలీసులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై రాములు అవగాహన కల్పించారు.