SRPT: నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం (నేడు) ఉపాధి హామీ పనుల (2024-25)పై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎల్.మన్సూర్ నాయక్ తెలిపారు. జిల్లా అధికారులు పాల్గొనే ఈ బహిరంగ విచారణకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
NRML: జిల్లా కేంద్రంలోని ఓ వైద్యుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాల నిర్మల్ బంద్‌కు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను నిరసిస్తూ ప్రతి ఒక్కరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇకపై హిందువులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.
కర్ణాటక విజయపుర జిల్లాలో ముగ్గురు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరగి గ్రామానికి చెందిన శంకరప్ప ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య రాజశ్రీ(28), పిల్లలు అనుశ్రీ(6), తను(3), కుమారుడు సంతోష్(1) కనిపించలేదు. గ్రామస్తులతో కలిసి వెతికారు. నలుగురూ ఓ బావిలో శవాలై కనిపించారు.
మన్యం: డంగభద్ర పరిసరాల్లో ఏనుగుల కదలికలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వేడి తీవ్రత కారణంగా కొలను వద్దకు చేరిన ఈ గుంపు, సాయంత్రం తర్వాత గ్రామాల వైపు దారితీశాయి. అప్రమత్తంగా ఉండాలని, పంటలను సురక్షితంగా నిల్వ చేసుకోవాలని అటవీ శాఖ రైతులకు హెచ్చరికలు జారీ చేసింది.
HYD నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. సౌత్ సెంట్రల్ రైల్వే రూ.430 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో రాయగిరి వరకు 33 కిమీ లైన్ నిర్మాణం జరగనుంది.
SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమం, అష్ట దివ్య కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు మహా పడిపూజ నిర్వహిస్తామని చెప్పారు.
WGL: వరంగల్ నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వేదికగా శుక్రవారం నిర్వహించిన IAIC 2026 సదస్సు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిని నిర్మించడంలో కీలక మైలురాయిగా నిలిచింది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌ను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో రూరల్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, రికార్డులు లేని వాహనాలపై శుక్రవారం కేసులు నమోదు చేశారు. ఎస్సై నాగేశ్వరావు తెలిపిన మేరకు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రికార్డులు లేని 6 వాహనాలపై కేసులు నమోదు చేశారు.
RCB స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ భారీ రికార్డ్‌కు కేవలం 2 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ IPL-2026 సీజన్ ఓపెనర్‌లో SRHపై భువీ ఇద్దరినీ ఔట్ చేసినా.. టోర్నీలో 200 వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. 221 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్(PBKS) అగ్రస్థానంలో ఉండగా.. భువీ(198), నరైన్(KKR) తర్వాతి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు.
SDPT: సిద్దిపేటలోని ఓ స్కూల్లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత వివరించారు. సిగ్నల్స్, రోడ్డు గుర్తులు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
MHBD: నెల్లికుదురు మండలం కాచికల్ స్టేజీ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. గంజాయి సేవిస్తున్న తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ పట్టుబడ్డారు. గంజాయి విక్రయానికి సంబంధించి నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉండగా, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ADB: సిరికొండ మండలం తిమ్మపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మడావి కాశిరామ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సిరికొండ నుంచి బోరిం వాడకు అతివేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
SKLM: ఎచ్చెర్ల డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB(3Y)కి సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్లు, (5Y)కి 2, 4, 6, 10 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నట్లు యూనివర్సిటీ డీన్ యు.జ్యోష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.1,050 లను ఏప్రిల్ 12వ తేదీలోగా యూనివర్సిటీ లేదా కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
SRPT: పాలకీడు మండల పరిధిలోని జాన్ పహాడ్ గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ పౌరాణిక నాటకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో, శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.
MDCL: ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, తార్నాక ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షం ప్రభావంతో దోమల బెడద కొంత తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రంగా వేధిస్తున్న దోమలు వర్షం కారణంగా తాత్కాలికంగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండటంతో మళ్లీ దోమలు పెరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.