BPT: పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
KMR: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గాంధారి మండలానికి చెందిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో శిశువు ఆరోగ్యం క్షీణించింది. సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాథమిక చికిత్స అందించి పసికందును కాపాడినట్లు తెలిపారు.
MBNR: జిల్లాలోని వివిధ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న ఏఎన్ఎం (ANM), అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల మెరిట్ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాను palamurubadi.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు.
MNCL: లైసెన్స్ సర్వేయర్ శిక్షణ పొందిన వారికి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ధ్రువపత్రాలు అందజేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన సర్వే పనులను లైసెన్సుడ్ సర్వేయర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
BHNG: CITU జిల్లా కమిటి సమావేశం భువనగిరి పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు.
TG: HYD మెట్రో టేకోవర్ తుది దశకు చేరింది. MAR 31లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బకాయిలపై టెక్నికల్ కన్సల్టెంట్‌గా DMRC, లీగల్ అడ్వైజర్‌గా IDBI నివేదికలు సిద్ధం చేశాయి. దీనిపై ఈ నెల 23న కేబినెట్ ఆమోదం తర్వాత HMRL, L&Tల మధ్య ఒప్పందాలు వేగవంతం కానున్నాయి. ఫైనాన్స్, టెక్నాలజీ స్టడీ నివేదికలు సిద్ధమవడంతో టేకోవర్‌కు మార్గం సుగమమైంది.
NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మైసిగండిలో నూతన ఇళ్లను ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
JGL: ధర్మపురి పట్టణానికి చెందిన వేముల రాజేష్‌కు చెందిన 2 బొలెరో వాహనాల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టడంతో పాటు టైర్లలో గాలి తీసివేసినట్లు తెలిసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై జి. మహేష్ తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఈనెల 22న ఆదివారం నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 6984 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
SDPT: పట్ట పగలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివరాత్రి దివాకర్ అనే దొంగను రాజగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజుపల్లిలో తాళం వేసి ఉన్న ముక్కెర వెంకటేశం అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బీరువాలో ఉన్న మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నరు.
ASF: జిల్లాలోని ST విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DTDO రమాదేవి ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ST విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HNK: జిల్లాలోని న్యూశాయంపేట, అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆమె ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్, R&B అధికారులకు సూచించారు.
AKP: కోటవురట్ల మండలం పాములవాకలో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. నేడో, రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తక్షణం దీనిని తొలగించి కొత్త ట్యాంకు నిర్మించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రామంలో కొత్త వీధికి పైప్ లైన్ల నిర్మాణం సరిగా జరగకపోవడంతో తాగునీరు అందడం లేదు.
ఆస్ట్రేలియా అమ్మాయిలతో భారత్ ఆడుతున్న 3 T20ల సిరీస్ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఇరుజట్లు అడిలైట్ వేదికగా సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మల్టీ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన హర్మన్ సేన.. ఈ T20 టైటిల్‌తో శుభారంభం పొందాలనే యోచనలో ఉంది.
VZM: బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం తెర్లాం మండలం గోపాలవలసలో సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్లు, OTPలు గుర్తుతెలియని వారికి చెప్పకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.