PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు సింగరేణి సంస్థకు చెందిన వైద్యులు గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేశారు. గనుల ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని SO2- GM చంద్రశేఖర్ అన్నారు.
జగిత్యాలలోని హోటళ్లు, రెస్టారెంట్లలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 22 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను గుర్తించి సీజ్ చేశారు.
BDK: దేశంలోనే అత్యధికంగా భద్రాద్రి పోలీసులు ఏడాది కాలంలో 6500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టుబడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలని అన్నారు.
ప్రకాశం: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. మార్కాపురం జిల్లాలోని 1,52,190 రైతులకు రూ.87.50 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ తెలిపారు. నగదు రైతుల ఖాతాలో జమ కానుందన్నారు. గిద్దలూరు-రూ.21.71 కోట్లు, కనిగిరి-రూ.24.30 కోట్లు, మార్కాపురం-రూ.19.05 కోట్లు, ఎర్రగొండపాలెం-రూ.22.45 కోట్లు మంజూరయ్యాయన్నారు.
TG: పదో తరగతి పరీక్షలు రేపటి(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 16వ తేదీతో పరీక్షలు పూర్తి అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
TPT: పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పోలీస్ బీట్ ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాలని వారు కోరుతూ నిన్న పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్రకు వినతి పత్రం అందజేశారు. గ్రామ భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 14 వ డివిజన్‌లో కార్పొరేటర్ ఇమ్రాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ వేడుకకు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గురువారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతోపాటు తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి ఉన్నారు.
HNK: హన్మకొండ నగరంలో నేడు కేయూకు ఎమ్మెల్సీ మల్లన్న ఉదయం 11 గంటలకు క్యాంపస్‌లోని సెనేట్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వర్సిటీ సమస్యలు, విద్యా ప్రమాణాలు, హాస్టల్ సమస్యలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. పరిష్కార మార్గాలను అన్వేషించే లక్ష్యంతో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ సతీశ్ తెలిపారు.
ELR: పోలవరం మండలం గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. 2018 ఏప్రిల్లో ఆడుకుంటున్న చిన్నారిని మభ్యపెట్టి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో, ఉమ్మడి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి వాణి గురువారం తీర్పు వెలువరించారు.
NLG: రేపటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పట్టణంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ధర్మనాయక్ తెలిపారు. మిర్యాలగూడ మండలం, పట్టణానికి చెందిన 2,840 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎంఈవో పేర్కొన్నారు.
కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం కిడ్నీ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కిడ్నీ విభాగాధిపతి డాక్టర్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం తెలిపారు. కిడ్నీ శరీరంలోని వ్యర్ధాలు తొలగించడం, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
VSP: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) సరకు రవాణా చేసి చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. 92 ఏళ్ల పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరకు రవాణా అని అధికారులు తెలిపారు. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 90 రోజులు ఉండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ATP: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు 162 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 164 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. వీరితో పాటు 9 మంది అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, 1941 మంది ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
TG: రవాణా శాఖలో ఇవాళ్టి నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఆన్‌లైన్‌లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇకపై డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లో డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోతే డీలర్ల లాగిన్ సస్పెండ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. 2 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తామని వెల్లడించారు.