HYD: యాకుత్‌పుర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు ఈద్గాలను సందర్శించారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ముస్లింలతో మాట్లాడి పండుగ ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు తెలిపారు. ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు.
KMM: విద్య, వైద్యం, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, గ్యారంటీల అమలుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి, పునర్నిర్మాణానికి పునాది వేసిందని నేడు వెల్లడించారు.
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో 110వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లకు ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
VZM: కవిత్వం విశ్వభాష అని, మంచి కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేయవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యులు డా. డివిజి శంకరరావు పేర్కొన్నారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన కవితోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రచయిత కాగుపాటి నారాయణమూర్తి రాసిన భావ కవితా వీచికలు కవితాసంపుటిని ప్రసాద్‌తో కలిసి ఆవిష్కరించారు.
అన్నమయ్య: చిన్నమండెంలోని జిల్లావాండ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మండెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి, ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం వారపు సంత ఒకరోజు తాత్కాలికంగా మరో చోటకు మారుస్తున్నట్లు సర్పంచ్ బండారు సింధు మధుబాబు శనివారం తెలిపారు. గ్రామ దేవత చల్లాలమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు సంత పరిధిలో జరుగుతాయి. అందువల్ల ఆ ఒక్కరోజు సంతను రావులపర్రు రహదారిలో గ్రోమోర్ ఎరువుల షాపు, పశువుల చెరువు సమీపంలో జరుగుతుందని వినియోగదారులు గ్రహించాలన్నారు.
RR: యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సర్పంచ్ రాయికంటి విజయ్ కుమార్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వయంగా స్వీట్లు పంపిణీ చేసి, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కారొబార్ మహేందర్, బీజేపీ నాయకులు సాయి కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ATP: అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శనివారం అశోక్ నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ముస్లిం మత పెద్దలు, సోదరులను కలిసి ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
TG: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆస్తుల పంపకంలో చెల్లికి అన్యాయం చేశారని మండిపడ్డారు. సొంత పత్రికలో తల్లికి వ్యతిరేకంగా రాయించే సుపుత్రుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
E.G: రాజమండ్రిలో నిర్వహించిన ABD ఛాంపియన్‌షిఫ్ టోర్నమెంట్‌లోని విజేతలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ట్రోఫీలను అందచేశారు. స్థానిక నెహ్రు నగర్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి విజేతలకు ఆ ట్రోఫీలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.
TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు GHMC ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందర్ రావు తదితరులు హాజరయ్యారు. కాగా, త్వరలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
NRPT: మరికల్ ఈద్గా మైదానంలో శనివారం రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణంలో రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈద్గాల వద్ద వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఆప్యాయతతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
కృష్ణా: అవనిగడ్డలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ఈద్గా మైదానంలో ఖురాన్ గురువుతో కలిసి ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దానధర్మాలు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.
HNK: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో గ్రామీణ ప్రకృతి ఉత్పత్తుల సంతను నిర్వహించారు. స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత సంపర్‌కు ప్రముఖ్ రవీందర్, సేంద్రియ వ్యవసాయ ప్రముఖ్ రామ్ రెడ్డి సంతను ప్రారంభించారు. సంతను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని, సంతలో సేంద్రియ ఉత్పత్తులు, గో-ఆదారిత ఉత్పత్తులు లభిస్తాయన్నారు.