KNR: గ్రూప్-1 అధికారిగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న బత్తుల శివకుమార్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్‌లోని రేకుర్తిలో అభినందించారు. గురువారం రేకుర్తిలో ఎమ్మెల్యేను శివకుమార్ మర్యాదపూర్వకంగా కలవగా.. ఆయనను శాలువాతో సత్కరించారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న అతనిని విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
PDPL: ఓదెల మండలం పొత్కపల్లిలో పండుగ పూట విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఫర్నిచర్ దుకాణం పూర్తిగా కాలిపోయింది. పుప్పాల రమేశ్ అనే వడ్రంగి నిర్వహిస్తున్న ఈ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో టేకు కర్రలు, యంత్రాలు, విలువైన కిటికీలు, తలుపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.
MNCL: సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ ఆర్థికంగా నష్టపోతుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్‌లు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.51 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో భవిష్యత్తులో సంస్థ నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.
ATP: జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు వదంతులను నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెల్లడించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే సాగుతోందని స్పష్టం చేశారు. విదేశీ యుద్ధాల వల్ల సరఫరా ఆగుతుందనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ASF: పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాగజ్‌నగర్ రాజీవ్ చౌక్‌లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సహీన్ సుల్తానా ప్రారంభించారు. ఈ సందర్భంగా శీతల పానీయాలు వద్దు-ప్రకృతి పానీయాలు ముద్దు అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.
PPM: ప్రత్యేక అధికారి పాలనలోనైనా పార్వతీపురం పురపాలన గాడిలో పడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ, టీడీపీ పాలనలో పురపాలన గాడి తప్పిందని ఆరోపించారు.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ చేశాడు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించాడు. ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఈవెంట్‌కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాలు బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
SDPT: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జామా మసీదులో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవాళ ఘనంగా నిర్వహించారు. మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జమాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు ఫలహారాలు అందించి ఉపవాసం విరమింపజేశారు. రంజాన్ మాసం పవిత్రతను గుర్తుచేస్తూ ఉపవాసం ద్వారా సహనాన్ని, పేదల బాధను అర్థం చేసుకోవాలని తెలిపారు.
JGL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రత్యేక వేదికపై ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పరాభవ నామ సంవత్సరంలో దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా వుంటారని ఆశీర్వచనం అందించారు.
BPT: ఒంగోలుకు చెందిన పూనూరు పవన్ కుమార్‌కు చెందిన AP40CA3200 నంబరు గల కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అతనిని చంపుతామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. బుధవారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
AKP: ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉన్న మందు గుండు సామగ్రిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందు గుండు సామగ్రి విలువ రూ.4,000 వరకు ఉంటుందన్నారు. మందు గుండు సామగ్రి నిల్వ చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మందు గుండు సామగ్రి నిలువ చేస్తే చర్యలు తప్పవన్నారు.
E.G: గోకవరం మండలంలోని సూదికొండ గ్రామ శివారు చెరువు వద్ద కోడి పందేల శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కోడిపుంజులు, రూ.1,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.నాగమణి తెలిపారు. జాతరల సాకుతో గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభివర్ణించారు. గురువారం ఎచ్చెర్ల జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్‌తో కలసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అంశాలను స్పటిస్తూ Dy.CM కళ్యాణ్ ఆలోచనలకు దగ్గరగా ఉంటూ సినిమా చాలా బాగుందని ప్రసంశించారు.
ASR: ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా సీఎం చంద్రబాబు గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అరకులోయ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ నాయకులు ఆనంద్, బుచ్చన్నలు గురువారం అరకులోయలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 2ఏళ్ళు గడిచిన వాలంటీర్లుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, తమను నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు చేస్తామన్నారు.
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం హరిశ్చంద్ర పురం, మందస, పాతపట్నం రైల్వే స్టేషన్లలో పలు రైలు హాల్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం అలికాంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్రమంత్రి కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.