వైసీపీ నేతలు విశాఖపట్నంలో విశాఖ గర్జన చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్ పోర్టులో కొందరు మంత్రులపై దాడి జరిగింది. ఆ దాడి జనసేన నేతలు చేశారంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో… ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు.
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లు కానీ, అది జనసేన వాళ్ళు చేసినట్లుగానీ పోలీస్ శాఖ నిర్ధారించలేదన్న ఆయన కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమే అని, అసలు దాడి సంస్కృతి మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన అన్నారు.
‘ఆ విద్యలో వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారని, విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోడి కత్తి హడావిడి చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదు. అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. మంత్రుల మీద దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యం గానే భావించాల్సి ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ జన సందోహం వచ్చింది… రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి, మీడియా దృష్టి మళ్లించేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెర తీసింది. విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసు? మంత్రుల కాకమ్మ కథలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తగినంత బందోబస్తు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశామని, అదే విధంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కు మా పార్టీ నేతలు లేఖ ఇచ్చారు. అయినా తగిన విధంగా స్పందించలేదని’ నాదెండ్ల మనోహర్ అన్నారు.
‘నామ మాత్రంగానే పోలీసు సిబ్బందిని కేటాయించడం వెనక అధికారులపై ఒత్తిడి ఉన్న విషయం అర్థమవుతోందని, పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా పవర్ కట్ చేశారు అంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలని ’పేర్కొన్నారు.