తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తమ తెలంగాణ బీజేపీ పార్టీ…. ఒక కమిటీ వేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసని అన్నారు.
ప్రజాధనం దోచుకోవడం తప్ప.. టీఆర్ఎస్కు దేనిపైనా చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పుడు వాగ్దానాలకు రైతులు బలవుతున్నారన్నారు. విద్యుత్ కొనుగోలులో భారీ స్కామ్ చేస్తున్నారని.. ఆ డబ్బులనే లిక్కర్ స్కామ్, ఫీనిక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ లబ్దిదారుల జాబితాను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ తన పొలంలో ఎకరాకు కోటి రూపాయల లబ్ది పొందుతున్నారట, రైతులకు కూడా చెప్పొచ్చు కదా అని ఆయన ఎద్దేవా చేశారు. పంటలకు మార్కెటింగ్ కోసం బడ్జెట్ ను తగ్గించారు, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో సాయిల్ టెస్ట్ జరుగుతోందని, కానీ తెలంగాణా లో భూ పరీక్షలు లేవని అన్నారు. తెలంగాణ ను సీడ్ బౌల్ చేస్తాము అన్నారు, విత్తనాలపై పరిశోధనకు రూపాయి ఖర్చు పెట్టలేదని, బడ్జెట్ కేటాయించలేదని, టమాటా పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదని పేర్కొన్న ఆయన రైతుల కోసం కేటాయించిన నిధులను కాళేశ్వరంలో ముంచుతున్నారని, ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కు బిడ్డ కోసం , కొడుకు కోసం కోట్లు ఇవ్వడానికి మనసు ఉందని, రైతుల కోసం పసల్ భీమా వాటా మాత్రం కట్టడని అన్నారు. ఫారెస్ట్ రేంజర్ హత్య ఘటన తర్వాత, పోడు భూముల సర్వేను ఆపేశారని ఆయన అన్నారు.
ఇక లిక్కర్ స్కాం పై ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవని, నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారు, చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు, అదే చేయమని చెబుతున్నానని అన్నారు.