న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు…
ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ దిశగా వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించరు. ఆంక్షల సమయంలో మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేస్తారు. లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ దిశగా వెళ్లే వాహనాలను కవాడిగూడ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా దారి మళ్లిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబరు 31న నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
మెట్రో సేవలు…
ఇక మెట్రో కూడా న్యూ ఇయర్ సందర్భంగా… బంపర్ ఆఫర్ ప్రకటించింది. మామూలుగా అయితే… రాత్రి 10 తర్వాత మెట్రో రైళ్లు నడవవు. అలాంటిది. న్యూ ఇయర్ సందర్భంగా… అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నట్లు మెట్రో సంస్థ తెలిపింది. రాత్రి ఒకటి గంటకు మొదటి స్టేషన్ నుండి చివరి మెట్రో రైలు బయలు దేరనుంది. అర్ధరాత్రి రెండు గంటలకు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నూతన సంవత్సర సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ డ్రైవ్లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవల సమయం పొడగించినట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. తాగిన మైకంలో మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెట్రో అధికారుల హెచ్చరికలు కూడా జారీ చేశారు.