మునుగోడు ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆ పార్టీ అధిష్టానం కోపంగా ఉంది. మునుగోడులో ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవదని కామెంట్లు చేయడం, దీనికి తోడు.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించమని ఫోన్లలో మాట్లాడటం వంటి చర్యల పట్ల పార్టీ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే..తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే తనను కలవాలని ఫోన్ చేయగా.. తనకు వీలు పడదని, తర్వాత కలుస్తానని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టించింది. ఒక పార్టీ బాధ్యుడికి బదులిచ్చే పద్ధతి ఇదేనా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం కోమటిరెడ్డి మీద ఫైర్ అయ్యారు. కాగా.. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఠాక్రే.. తనను కలవాల్సిందిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పోన్ చేశారు. మొదట తనకు కలవడం కుదరదని చెప్పిన వెంకట్ రెడ్డి.. గురువారం నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఠాక్రే షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అడగగా.. వాటిని ఎప్పుడో చెత్తబుట్టలో పడేశానని కోమటిరెడ్డగి వెంకట్ రెడ్డి సమాధానమిచ్చారు. అసలు పీసీసీ కమిటీలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని బదులిచ్చారట. ఆరేడుసార్లు ఓడిపోయిన వాళ్లు ఉండే పీఏసీలో నేను కూర్చోవాలా అంటూ ఠాక్రేను ప్రశ్నించారు కోమటిరెడ్డి. అయితే.. నియోజకవర్గ పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఫోన్ చేయగానే రాలేకపోయానని కోమటిరెడ్డడి ఠాక్రేకు చెప్పారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో విబేధాలు పక్కన పెట్టి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఠాక్రే సూచించారు. మీడియా ముందుకు, టీవీల ముందుకు కాదు.. జనాల్లోకి వెళ్లాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చారు. కాకపోతే పార్టీలో కొంతమంది సీనియర్లను కావాలనే అవమానపరుస్తున్నారని, కించపరుస్తున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు వీడియో వైరల్ అయ్యింది. దీనిపై అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి వెంకట్ రెడ్డి సమాధానం కూడా ఇచ్చారు. కాగా అప్పటి నుంచి వెంకట్ రెడ్డి పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. తాజాగా ఠాక్రేతో సమావేశమై ఇబ్బందులు, అభ్యంతరాలను తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించాలని సూచించిన ఠాక్రే సలహలు పాటిస్తామన్నారు కోమటిరెడ్డి.