లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతల పేర్లు కూడా ఉండటంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈడీ రిపోర్ట్ పై కవిత స్పందించారు.
దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అధికారాన్ని సొంతం చేసుకున్నారని, ప్రజాస్వామ్యయుతంగా గెలవాలి తప్పించి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని ప్రభుత్వాలను కూలగొట్టడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు తమ వెంట ఉన్నంతకాలం ఎవరూ ఏమి చేయలేరని కవిత పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చి లిక్కర్ స్కామ్‌పై ప్రశ్నిస్తే సమాధానాలు చెబుతామని, తమకు ఎలాంటి భయం లేదని కవిత పేర్కొన్నారు. మీడియాలో లీకులు ఇచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం తగదని కవిత తెలిపారు. తెలంగాణలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కవిత తెలియజేశారు.
మోడీ వచ్చే ముందు ఈడీ రావడం సహజమేనని, వచ్చే ఎడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఈడీ పేరుతో కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయమైన ఎత్తుగడలతో ఈడీ కేసులు పెడుతోందని అన్నారు. వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీసేందుకే మీడియాలో లీకులు వస్తున్నాయని, జైల్లో పెడతామంటే భయపడేది లేదని, జైల్లో పెడితే ఏమౌతుందని, ఉరేమి వేయరు కదా అని కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.