Budget 2024 : కోటి మందికి ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించడం చిన్న నిర్ణయం కాదు. కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద 300 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఈ పథకం ప్రతి వినియోగదారుడు రూ. 18000 వరకు ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. పైకప్పులపై సౌరశక్తి ద్వారా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రభుత్వానికి రెట్టింపు విజయంగా పరిగణించబడుతుంది. ముందుగా ప్రభుత్వం ఈ పథకం ద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రెండవ ప్రయోజనం ఏమిటంటే పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు ఉపశమనం లభిస్తుంది. ఈ పథకం మీకు రూ. 18,000 ఎలా ఆదా చేయగలదో తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన లక్ష్యం సోలార్ రూఫ్ ఇన్స్టాలేషన్ల ద్వారా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడం. అంతేకాకుండా అదనపు విద్యుత్ ఉత్పత్తికి కూడా అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 జనవరి 22న ఈ ప్రకటన చేశారు. అధిక సంఖ్యలో నివాస వినియోగదారులను రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ సిస్టమ్‌లను ఇన్స్టాల్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఒక ప్రధాన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా ప్రధాన మంత్రి అభ్యర్థించారు. ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. శ్రీరాముని పవిత్రోత్సవం సందర్భంగా ప్రధాని తన అయోధ్య పర్యటన ముగిసిన వెంటనే ఒక సమావేశాన్ని నిర్వహించారు. కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పైకప్పు ఉన్న ఇళ్లు సూర్యరక్తిని వినియోగించడం ద్వారా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చని, కరెంటు అవసరాలకు స్వయం ఆధారపడవచ్చని అన్నారు.
పథకానికి ఎవరు అర్హులు
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ద్వారా కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాల వారి విద్యుత్ బిల్లులను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
గ్రిడ్-కనెక్ట్ చేయబడిన రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ప్రయోజనాలు ఏమిటి?
* విద్యుత్ బిల్లులో వినియోగదారునికి ఆదా అవుతుంది.
* ఖాళీ పైకప్పు స్థలాన్ని ఉపయోగించడం, అదనపు భూమి అవసరం లేదు.
* అదనపు ప్రసార, పంపిణీ (T&D) లైన్లు అవసరం లేదు.
* విద్యుత్ వినియోగం, ఉత్పత్తి మధ్య సమతుల్యత కారణంగా T&D నష్టం తగ్గుతుంది.
* టెయిల్-ఎండ్ గ్రిడ్ వోల్టేజ్లో మెరుగుదల, సిస్టమ్ రద్దీలో తగ్గింపు.
* కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక శక్తి, పర్యావరణ భద్రత.
* డిస్కమ్‌లు/యుటిలిటీ ద్వారా పగటిపూట పీక్ లోడ్ మెరుగైన నిర్వహణ.
వార్షిక పొదుపు రూ.18 వేలు
300 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల సామాన్యులు ఎలా ఆదా చేస్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. దీనిని ఉదాహరణగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. యూనిట్ విద్యుత్ ధర సగటున రూ.5. నెలలో 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తే, దాని ధర దాదాపు రూ.1500. 12 నెలలతో లెక్కిస్తే ఏడాది మొత్తానికి 3600 యూనిట్ల ధర రూ.18,000 అవుతుంది. అంటే నెలలో 300 యూనిట్లు, ఏడాదికి 3600 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందడం ద్వారా ప్రజలకు రూ.18000 ఆదా అవుతుంది. అంటే కోటి కుటుంబాలకు ఏడాదిలో రూ.18 వేల కోట్లు ఆదా అవుతుంది.