త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు బీజేపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును విస్తరించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే వేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్న తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్టీ విజయావకాశాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా పార్టీ అధినేతలు ఈ అవకాశం ఇవ్వనున్నారట. సార్వత్రిక ఎన్నికలకు సమయం కూడా తక్కువ ఉండటంతో.. పార్టీ విజయాన్ని ప్రభావితం చేసే నేతలు/ సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇవ్వనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లలో ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి అయితే బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లో ఒకరికీ ఛాన్స్ ఉంటుందట. వీరంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో వీరి ఓట్లు కూడా ఎక్కువే. ఆ వర్గం ఓట్లు రాబట్టుకోవాలంటే వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే బెటర్ అని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో ఆయనకు మంత్రి పదవీ ఇస్తే.. మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ బలమైన నేత ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. అతనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఖాయం అని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇప్పట్లో పార్టీ అధ్యక్షుడిని మార్చబోమని ఇదివరకే స్పష్టంచేశారు. దీన్ని బట్టి చూస్తే.. కేంద్ర మంత్రిపదవి అవకాశాలు బండి సంజయ్ కంటే.. ధర్మపురి అర్వింద్ కే ఎక్కువ ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు.
కేంద్ర మంత్రిపదవి రేసులో ధర్మపురి అర్వింద్ ముందు వరసలో ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ పేరుతో పాదయాత్ర చేసి, జనాల్లోకి వచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి రైతులు విశ్వసించి గెలిపించారు. కానీ ఎన్నికయ్యాక ఆ ఊసే మరిచిపోయాడు. దీంతో అతను వెళ్లిన ప్రతీ చోట నిరసన సెగ తప్పడం లేదు. డీఎస్ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకొస్తే.. పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ ఆలోచించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అర్వింద్‌కు కలిసొచ్చే అంశం ఏమిటంటే.. ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీకి 3 ఎంపీ స్థానాలు ఉన్నాయి. డాక్టర్ కే లక్ష్మణ్‌కు కూడా క్యాబినెట్ బెర్త్ కోసం పోటీలో ఉన్నారు. ఆయన పార్టీకి సీనియర్ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కిషన్ రెడ్డి కన్నా ముందే ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. లక్ష్మణ్ జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవీ చేపట్టారు. అయితే ఈయనకు మంత్రి పదవీ కూడా ఇస్తే.. హైదరాబాద్ నుంచి ఇద్దరికీ పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సోయం బాబురావుకు అవకాశం ఉంటుంది. ఈ నలుగురిలో ఒకరినీ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవీ వరించనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎంపీ సీటును బీజేపీ గెలవలేదు. ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సీఎం రమేష్‌తోపాటు జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరిలో ఒకరికీ కేంద్ర మంత్రి పదవీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చిన నేత.. జీవీఎల్ మాత్రం తొలి నుంచి బీజేపీలో ఉన్నారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆయనకు పేరుంది. జీవీఎల్ నరసింహారావుకే కేంద్రమంత్రి పదవీ రావొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.