నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మరో మలుపు తిరిగింది! ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న నందకుమార్ వాంగ్మూలాన్ని గత నెల 10వ తేదీన రికార్డ్ చేసింది సిట్. ఈ సందర్భంగా నందకుమార్ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, సింహయాజులుతో ఎలా లింక్ కలిసిందనే అంశంపై నందకుమార్ నుండి సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరి, కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్లో చేరిన దాసోజు శ్రవణ్ పేరు తెరపైకి వచ్చింది. తనకు సింహయాజీని పరిచయం చేసింది, దాసోజు అని, ఆ తర్వాత రామచంద్ర భారతిని కలిసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో, రామచంద్ర భారతిని పరిచయం చేశానని సిట్ ఎదుట వెల్లడించారని తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఆయనే బీజేపీలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు.
గత జూన్ నెలలో దాసోజు శ్రవణ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తనకు సింహయాజీతో పరిచయం చేశారని, ఆ తర్వాత ఢిల్లీకి సింహయాజీతో వెళ్లినప్పుడు రామచంద్ర భారతిని కలిశానని చెప్పారు. ఢిల్లీలోని బీబీ పాటిల్ ఇంట్లో లంచ్ కూడా చేశామన్నారు. పాటిల్ తనకు బంధువు అవుతారని తెలిపారు. తనకు హోటల్ బిజినెస్ ఉండటంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డితో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ఎమ్మెల్యేతో దాదాపు ఏడేళ్ల క్రితం లింక్ కుదిరిందన్నారు. ఇటీవల రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించానన్నారు. ఓసారి తన ఇంటికి సింహయాజీ వచ్చినప్పుడు, రోహిత్ రెడ్డి కూడా వచ్చారని, వారిని పరిచయం చేశానన్నారు.
తనకు బీజేపీ, ఆరెస్సెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, కానీ రాజకీయంగా మంచి అవకాశాల ఆలోచనలతో అలా తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వెలుగు చూసినప్పుడు రోహిత్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పూజల పేరుతో తీసుకు వచ్చారని, కానీ పార్టీ మార్పు అంశం వారికి తెలియదని తెలుస్తోంది. ఈ విషయం వెలుగు చూసిన రోజు, అలాగే సిట్ విచారణలోను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే విషయం చెప్పినట్లుగా సమాచారం. సరదాగా తాము రోహిత్ రెడ్డితో వచ్చామని, కానీ బీజేపీ ఆఫర్ అంశం చెప్పలేదని వారు చెబుతున్నారు. అయితే మొత్తానికి అసలు బీజేపీతో సంబంధం లేకుండానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా నందకుమార్ స్టేట్ మెంట్ ద్వారా తెలుస్తోంది. అసలు తనకు బీజేపీతో సంబంధం లేదని సిట్ ఎదుట చెప్పారని తెలుస్తోంది. అయితే బీబీ పాటిల్ నివాసంలో లంచ్, టీఆర్ఎస్లో ఉన్న దాసోజు శ్రవణ్… సింహయాజీతో పరిచయం చేయడం చర్చనీయాంశంగా మారింది.