సోషల్ మీడియాను యువత దుర్వినియోగ పరుస్తోంది. అవసరాలకు వాడుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. దీని పర్యావసనాలు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయితో చేసిన వీడియో కాలింగ్ ద్వారా సినిమా రేంజ్ లో కట్టు కథ అల్లాడు. చివరికి కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ ఘటనలో అనేక ట్విస్ట్ లు ఉన్నాయి. సినిమాలో కూడా లేనంత ట్విస్ట్ లు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు.
వివరాలు వెల్లడిస్తున్న ప్రయాగ్ రాజ్ పోలీసులు
ప్రయాగ్ రాజ్ కు చెందిన అభిషేక్ తివారీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఫేస్ బుక్ లో అంకిత శర్మ అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త మితిమీరింది. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. వాట్సప్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఒక రోజు ఆ యువతి అభిషేక్ కు న్యూడ్ వీడియో కాల్ చేసింది. కంగారు పడిపోయిన అభిషేక్ వెంటనే కాల్ కట్ చేశాడు. అయితే అప్పటికే ఆమె వీడియో కాల్ రికార్డు చేసింది.
ఆ వీడియోను చూపించి ఒకరు ఫోన్ చేసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. భయపడిన అభిషేక్ రూ.30, 000 ఇచ్చాడు. అంతటి సర్దుకోకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన వద్ద డబ్బుల్లేక.. వీరి వేధింపులు తాళలేక కిడ్నాప్ డ్రామా ఆడాడు. తాను కిడ్నాప్ అయ్యానని తండ్రి జ్యోతిష్ తివారీకి ఫోన్ చేసి చెప్పాడు.
రూ.2 లక్షలు ఇవ్వకపోతే కుమారుడిని చంపేస్తామని వేరే వారితో అభిషేక్ బెదిరించాడు. దీంతో తండ్రి జ్యోతిష్ కుమారుడి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా అభిషేక్ జాడ గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కుమారుడే ఈ డ్రామా ఆడుతున్నాడని గుర్తించి పోలీసులు అందరూ అవాక్కయ్యారు. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో పోలీసులకు పూస గుచ్చినట్లు అభిషేక్ వివరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ సంతోశ్ కుమార్ మీనా తెలిపారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ఇలాంటివి జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.