సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ విస్తారక్ సమావేశం బీహార్‌లో జరిగింది. ముఖ్యమంత్రి, జనతా దళ్ అధినేత నితీష్ కుమార్‌పై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. యాంటీ బీజేపీ ఫోర్స్‌కు నితీష్ కీలక నేతగా ఉండటంతో టార్గెట్ చేసింది.
ఇప్పుడు మళ్లీ నెల రోజుల తర్వాత పార్లమెంటరీ విస్తారక్ సమావేశాన్ని బుధ, గురువారాలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పిన కేసీఆర్ టార్గెట్‌గా ఇప్పుడు ఈ సమావేశం జరుగుతోందని చెప్పవచ్చు. 87 పార్లమెంటు నియోజకవర్గాల విస్తారక్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అలాగే, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత బీఎల్ సంతోష్ మొదటిసారి వచ్చారు.
దక్షిణాదిపై.. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019లో బాగా పుంజుకున్న కమలందళం, ఆ తర్వాత నుండి తన దూకుడును మరింతగా పెంచింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తోడయ్యారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ హయాం కంటే పార్టీని పరుగు పెట్టిస్తున్నారు. దీనికి అమిత్ షా చాణక్యం, మోడీ చరిష్మా తోడైంది. ఇప్పటికే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి, ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా బీజేపీ కేడర్ ఉత్సాహంతో ఉంది. ఓ వైపు రాష్ట్ర నేతలు కేసీఆర్ పాలనలోని లోపాలు ఎత్తి చూపిస్తుంటే, ఇంకోవైపు కేంద్ర నాయకత్వం స్ట్రాటెజీతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడంతో పాటు ఇదే రాష్ట్రాన్ని దక్షిణాదికి గేట్-వేగా భావిస్తోంది. 2023లో ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం ద్వారా 2024లో జరిగే లోకసభ ఎన్నికల్లో మైలేజ్ పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగానే భాగ్యనగరంలో విస్తారక్ల సమావేశం.
హైదరాబాద్‌లోని ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం, ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, కవిత లిక్కర్ కేసు, సీబీఐ, ఈడీ సోదాలు, విచారణలు వంటి హాట్ హాట్ రాజకీయం కనిపిస్తున్న సమయంలో బీజేపీ ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంతో బలంగా పోరాడతున్న తన కేడర్‌కు, నేతలకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు, వారిలో మేమున్నామనే విశ్వాసాన్ని నింపేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తోంది.
అదే సమయంలో తెలంగాణలో ఎంట్రీ ద్వారా దక్షిణాదిన మరింత దూకుడు పెంచవచ్చునని భావిస్తోంది. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీ ఎక్కడా అధికారంలోకి వచ్చింది లేదా ప్రభావం చూపింది లేదు. కర్నాటక తర్వాత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోందనే ఉత్సాహంతో ఉంది. దీనికి తోడు 2019 లోకసభ ఎన్నికలకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత దక్షిణాదిని ప్రభావితం చేయాలని భావిస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరిలలో పార్టీ ఎలా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది, ఏఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు గెలవలేదు లేదా కనీస ప్రభావం చూపలేదు అనే అంశాలపై చర్చిస్తుంది. తద్వారా 2023లో తెలంగాణలో గెలిస్తే, ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కేరళ, తమిళనాడులపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ తర్వాత తమిళనాడుపై బీజేపీ దృష్టి సారించింది. బీజేపీకి లోకసభలో రెండుసార్లు సంపూర్ణ మెజార్టీ వచ్చినప్పటికీ దక్షిణాది నుండి వచ్చిన సీట్లు చాలా చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మెజార్టీ స్థానాలు గెలిచి, తమ పార్టీ కేవలం ఉత్తరాదికి పరిమితం కాదని చెప్పాలని చూస్తోంది.