వన్డే ప్రపంచ కప్ (World Cup) సమీపిస్తున్న తరుణంలో టీమిఇండియాలో నాలుగు స్థానంలో ఎవరు? ఈ ప్రశ్న చాలా రోజుల నుండి వస్తూనే ఉంది. యువరాజ్‌సింగ్ (Yuvraj Singh) రిటైర్ అయ్యాక ఆ నాలుగో స్థానంలో ఇప్పటివరకు స్థిరమైన ఆటగాడు దొరకలేదు. దొరికినా ఇప్పుడు అందుబాటులో లేరు. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండగా.. స్వయంగా కెప్టెన్ రోహిత్ (Captain Rohit) ఈ మాట అన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో రోహిత్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం ఖాయం. మూడో స్థానంలో ఎప్పట్నుంచో విరాట్ కోహ్లి (Virat Kohli) ఆడుతున్నాడు. కానీ అతడి తర్వాత బ్యాటింగ్‌కు ఎవరు వస్తారనే విషయంలో స్పష్టత లేదు.
కొన్ని నెలల ముందు వరకు శ్రేయస్ అయ్యర్ ఆ స్థానంలో ఆడేవాడు. ప్రపంచకప్‌లోనూ అతనే నంబర్ 4లో ఆడతాడని అనుకున్నారు. అజింక్య రహానె, మనీష్ పాండే, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా చాలామందిని భారత్ ప్రయత్నించి చూసింది. మిగతా వారితో పోలిస్తే శ్రేయస్ మెరుగైన ప్రదర్శన చేశాడు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో సూర్య కుమార్(Surya Kumar), ఇషాన్ కిషన్ మాత్రమే నాలుగో స్థానానికి చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయాలు. కానీ టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో ఇంకా రుజువు చేసుకోలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌లో మెరుగ్గా ఆడుతున్నాడు కానీ.. నాలుగో స్థానానికి సరిపోడనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (Tilak Verma) గురించి చర్చ జరుగుతోంది. మరి సెలక్టర్లు, జట్టు యాజమాన్యం ఆలోచన ఎలా ఉందో చూడాలి.