Yuvraj Singh : లోక్సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారా?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై నేరుగా యువరాజ్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
Yuvraj Singh to contest LS polls? : ఈ ఏడాది వేసవికాలం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ చేయనున్నారా? అనే ప్రశ్నపై స్వయంగా ఆయనే స్పందించారు. ఇటీవల ఈ వార్తలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఊహాగానాలన్నింటికీ యువరాజ్ సింగ్ చెక్ పెట్టారు. ఆయన ఈ విషయంపై తన ఎక్స్ ఖాతాలో ఇలా స్పందించారు.
పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి బీజీపీ పార్టీ తరఫున యువరాజ్ సింగ్(Yuvraj Singh) పోటీ చేస్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తాను ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసి పుచ్చారు. రాజకీయాలకంటే ప్రజలకు సేవ చేయడమే తనకు ఇష్టమని చెప్పారు. అందుకనే తాను ‘యువీకెన్’(YOUWECAN) ఫౌండేషన్ ద్వారా సేవలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నానని అన్నారు.
ప్రస్తుతం యువీ కెన్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని యువరాజ్ సింగ్ తెలిపారు. ప్రజలకు తన సాయ శక్తులా సాయం చేయడంతోనే తన ఫ్యాషన్ ఉందన్నారు. యువరాజ్ సింగ్ ఇటీవల తన తల్లి షబ్నమ్ సింగ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అప్పటి నుంచి యువరాజ్ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాలో పలు వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ యువరాజ్ ఇప్పుడు ఫుల్స్టాప్ పెట్టినట్లయింది.