»Robbed Netherlands Tourist Stranded In Odisha For Over A Month
Dutch Tourist : డచ్ పర్యాటకుడిపై లూటీ… నెల రోజులుగా బిచ్చగాళ్లతో టూరిస్ట్!
ఓ క్యాబ్ డ్రైవర్ భారత పర్యటనకు వచ్చిన డచ్ టూరిస్ట్‌ని బెదిరించి అతడిని లూటీ చేశాడు. దీంతో స్వదేశం వెళ్లలేక అతడు బిచ్చగాళ్ల దగ్గర నెల రోజులుగా బస చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Dutch Tourist Robbed By Cab Driver : నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు వచ్చిన డచ్ టూరిస్ట్‌పై ఓ ట్యాక్సీ డ్రైవర్ బెదిరింపులకు దిగాడు. దాడి చేసి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులును దోచుకున్నాడు. దీంతో అతడికి తిరిగి నెదర్లాండ్స్(Netherland)కి వెళ్లడానికి డబ్బులు లేకుండా పోయాయి. దీంతో బిచ్చగాళ్ల షెల్టర్ హోంలో బస చేశాడు. మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఒడిస్సా(Odisha) రాష్ట్రం పూరీలో ఈ ఘటన జరిగింది. మీడియా ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రభుత్వం ఆ డచ్ టూరిస్ట్‌ని స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆంథోనీ వాన్ ఆర్కెట్ (72) అనే వ్యక్తి జనవరిలో పూరీకి వచ్చాడు. జనవరి 9న క్యాబ్‌లో భువనేశ్వర్ వెళ్లి తన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకుని బయలుదేరాడు. మార్గ వధ్యంలో కారు డ్రైవర్ తన దగ్గర ఉన్న సుమారు రూ.3.5లక్షల నగదును దోచుకున్నాడని ఆంథోనీ తెలిపాడు.
‘ఈ విషయంపై నేను డ్రైవర్‌తో గొడవ పడ్డాను. దీంతో ఆ డ్రైవర్ నన్ను తీసుకెళ్లి తన ఇంట్లో మూడు రోజుల పాటు బంధించాడు. ఆ తర్వాత ధోలే పాండా అనే ప్రాంతంలో వదిలిపెట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను కొంత మంది యువకులు రక్షించారు. వాళ్ల సాయంతో నేను పూరీ చేరుకున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల జనవరి 25 నుంచి మార్చి 1 వరకు బిచ్చగాళ్ల షెల్టర్ హోమ్‌లో ఉండాల్సి వచ్చింది’ అని ఆంథోనీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఘటన మీడియా ద్వారా బయటకు రావడంతో ఆ జిల్లా యంత్రాంగం స్పందించి రాష్ట్రఅతిధి గృహంలో బస చేసేందుకు ఏర్పాటు చేసింది.