Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ యువకుడు రైలు పట్టాలపై రైలు ముందు పడుకున్నాడు. లోక్ పైలట్ రైలును ఆపే సమయానికి రైలులోని నాలుగు కోచ్లు యువకుడిపై నుంచి వెళ్లాయి. కాసేపటి తర్వాత రైలు ఆగడంతో యువకుడిని రైలు కింద నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడిని ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడని, దాని కారణంగా అతను కాన్పూర్ వదిలి ఉన్నావ్ చేరుకున్నాడని అప్పుడు వెలుగులోకి వచ్చింది. జీవితంపై విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ కుదరలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ సింగ్ అనే యువకుడు కాన్పూర్లోని శాస్త్రి నగర్లో నివసిస్తున్నాడు. అతని వయస్సు 26 సంవత్సరాలు. శుక్రవారం సాయంత్రం కాన్పూర్ నుంచి రైలులో ఉన్నావ్ చేరుకున్న అతను లోక్నగర్ క్రాసింగ్ వద్ద అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఆపై కాన్పూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న రప్తీ సాగర్ ఎక్స్ప్రెస్ రైలును చూసి పట్టాలపై పడుకున్నాడు. లోకో పైలట్ రైలును ఆపే సమయానికి రైలులోని నాలుగు కోచ్లు యువకుడిపై నుంచి వెళ్లాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం ఘటనలో ఆ యువకుడికి గీత కూడా పడలేదు.
ఉన్నావ్ కొత్వాలి ఇన్ఛార్జ్ ప్రమోద్ మిశ్రా మాట్లాడుతూ.. యువకుడికి అతని కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కాన్పూర్ నుంచి రైలులో ఉన్నావ్ వచ్చాడు. కొంతకాలం అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు. రైలు రావడం చూసి పట్టాల మధ్యలో పడుకున్నాడు. యువకుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశామని ప్రమోద్ మిశ్రా తెలిపారు. యువకుడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇప్పుడు ఆ యువకుడు తిరిగి కాన్పూర్ వెళ్లిపోయాడు.