Heat wave : దేశ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మేనెలలో వచ్చే రోహిణీ కార్తి ఎండల్ని తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలకు చేరువకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి.
Meteorological Department said more sunshine in Hyderabad in the next 5 days
Heat wave : తెలుగు రాష్ట్రాల్లోనే కాదండీ.. దేశ వ్యాప్తంగా ఎండలు సుర్రమంటున్నాయి. ఏప్రిల్ నెలలోనే మేనెల ఎండల్ని తలపిస్తున్నాయి. దీంతో వేసవి తాపానికి తాళలేక ప్రజలు ఆపసోవాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకెలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మధ్య, తూర్పు, వాయువ్య భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో గతంలో కంటే ఎక్కువ వేడి గాలులు, తాపం ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర అధికంగా నమోదు అవుతాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి నమోదు అవుతున్నాయి. బుధవారం నల్గొండ జిల్లా నిడమానూరులో 44.8, హాలియాలో 44.4, నల్గొండ పట్టణంలో 44.7, మునుగోడులో 44.5 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి నమోదు అవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.