»Pulled T Shirt Put Hand On Chest Wrestlers Fir Against Brij Bhushan Says
Brij Bhushan FIRలో సంచలన విషయాలు.. ‘ఛాతీపై తాకేవాడు.. పైకి లాక్కునేవాడు‘
ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు
భారత రెజ్లర్లను లైంగికంగా వేధించిన (Sexually Harassement) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడి వలన పరువు పోతుండడంతో బీజేపీ పక్కనపెట్టేసిందని.. త్వరలోనే అతడి అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) కాపీ బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ లో భారత రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఛాతీపై చేయి వేయడం, కోరిక తీరిస్తే ఖర్చు భరిస్తాననడం’ వంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రెజ్లర్లు ఢిల్లీలో (Delhi) ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు (Women Wrestlers) బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Sharan Singh)పై ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ (Connaught Place Police Station)లో ఫిర్యాదు చేశారు. గత నెలలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 28వ తేదీన నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ లలో దారుణ విషయాలు బయటకు వచ్చాయి.
‘బ్రిజ్ భూషణ్ కు భయపడి మహిళా అథ్లెట్లు (Athletes) ఎప్పుడూ మా గదుల్లో నుంచి బయటకు వచ్చినా అందరం ఒక్కచోటనే ఉండేవాళ్లం. అయినప్పటికీ ఆయన మా బృందంలో నుంచి ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారు. వాటికి మేం బదులిచ్చేవాళ్లం కాదు. అంత దారుణంగా అతడి ప్రశ్నలు ఉండేవి’ అని ఓ మహిళా రెజ్లర్ ఎఫ్ఐఆర్ కాపీలో వాపోయింది. ‘ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస (Breath) ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు’ మరో రెజ్లర్ ఆరోపించింది.
‘కోచ్ (Coach) లేని సమయంలో మా వద్దకు వచ్చి అభ్యంతరకరంగా ప్రవర్తించేవారు’. ‘విదేశాల్లో జరిగిన పోటీల్లో నేను గాయపడ్డా (Injured). అప్పుడు బ్రిజ్ భూషణ్ వచ్చి తనతో చనువుగా ఉంటే చికిత్సకయ్యే ఖర్చులన్నీ డబ్ల్యూఎఫ్ఐ భరిస్తుందని చెప్పాడు’ అని సీనియర్ రెజ్లర్ వాపోయింది. బ్రిజ్ భూషణ్ తో పాటు డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శి వినోద్ తోమర్ కూడా వేధింపులకు పాల్పడ్డాడు. ‘ఓ సారి నేను ఢిల్లీలోని డబ్ల్యూఎఫ్ఐ (WFI) కార్యాలయానికి వెళ్లినప్పుడు వినోద్ తోమర్ (Vinod Tomar) అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అందరినీ బయటకు పంపించి గదిలో నన్ను బలవంతంగా తనపైకి లాక్కొన్నారు’ అని మరో రెజ్లర్ ఫిర్యాదులో కన్నీటి పర్యంతమైంది.
బ్రిజ్ భూషణ్ అఘాయిత్యాలు, అతడి ప్రవర్తన బహిర్గతమవడంతో దేశవ్యాప్తంగా అతడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీలు బయటకు రావడంతో ఇక అతడిపై తీవ్ర చర్యలు (Serious Action) తీసుకునే అవకాశం ఉంది. అతడి వలన పరువు పోతుండడంతో బీజేపీ బ్రిజ్ భూషణ్ ను పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెజ్లర్ల ఫిర్యాదు కాపీల వివరాలు బయటకు వచ్చాయి. త్వరలోనే అతడు అరెస్టయ్యే అవకాశం ఉంది. కాగా, బ్రిజ్ భూషణ్ అరెస్టయ్యేంత దాకా తమ పోరాటం కొనసాగుతుందని భారత రెజ్లర్లు స్పష్టం చేస్తున్నారు. వారు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.