Nayab Singh Saini: హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇతనిని నూతన సీఎంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. సైనీ ప్రస్తుతం కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు నాయబ్ సైనీ వైపు బీజేపీ అధిస్ఠానం మొగ్గుచూపింది. ఈయన ఖట్టర్‌కు దగ్గర స్నేహితుడు.
ఓబీపీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హర్యానా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతం. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈక్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.