»Mudra Loan Limit Doubles Government Enhances Credit Access For Small Businesses To %e2%82%b920 Lakh
Budget 2024 : ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు
ముద్ర రుణాలు తీసుకోవాలని చూసేవారికి శుభవార్త. ఈ పథకం కింద లోన్ గరిష్ఠ పరిమితిని రూ.10లక్షల నుంచి 20లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టి ముఖ్యాంశాలను ప్రసంగిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ముద్ర లోన్ గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు దీని ద్వారా లబ్ధి పొంద వచ్చునని తెలిపారు. ఇప్పటికే ముద్రా లోన్లు(MUDRA LOANS) తీసుకుని సకాలంలో వాటిని కట్టేసిన వారికి ఈ సదుపాయం కలుగుతుందని నిర్మల సీతారామన్ తెలపారు.
ప్రధాన మంత్రి ముద్రా యోజన(PMMY) పథకం కింద బ్యాంకులు లబ్ధిదారులకు మూడు విధాలైన లోన్లను ఇస్తుంటాయి. శిశు, కిశోర్, తరుణ్ అని లోన్ తీసుకునే డబ్బు ఆధారంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. రూ.50వేలలోపు రుణం తీసుకునే వారికి శిశు, రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు లోన్ తీసుకునే వారికి కోశోర్, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు లోన్ తీసుకునే వారికి తరుణ్ కింద ముద్ర లోన్ స్కీమ్‌లో(MUDRA LOAN SCHEME) రుణాలను మంజూరు చేస్తారు. ప్రస్తుతం 2024 బడ్జెట్లో పేర్కొన్న దాని ప్రకారం తరణ్ కేటగిరి కింద రూ.20లక్షల వరకు ముద్రా రుణాలను తీసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తాకట్టు లేకుండా, థర్డ్ పార్టీ హామీ లేకుండా లోన్‌ను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘క్రెడిట్ గ్యారెంఎటీ స్కీమ్’ని తీసుకువస్తుందని నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) స్పష్టం చేశారు.