సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు(అక్టోబర్ 5న) ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో భాగంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 283 మంది ప్రతినిధులు సహా పలువురు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, జెండాను కూడా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని మార్పు చేస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. పార్టీ పేరును ప్రకటించిన తర్వాత అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీ పేరు మార్పు, అభ్యంతరాలపై దాదాపు 30 రోజులు పట్టనుంది. కానీ 29ఏ 9 సబ్‌క్లాజ్ ప్రకారం ఈసీ వెంటనే ఆమోదించే అవకాశం ఉందని పలువురు నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 నుంచి బీఆర్ఎస్ అమల్లోకి రావచ్చని చెబుతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన కూడా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు KCR పేర్కొన్నారు. రైతులు సహా అనేక మంది సమస్యలు అలాగే ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో అందిస్తున్న అద్భుత పాలనను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కేసీఆర్ ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలపై మొదట ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఏపీలో కూడా పలువురు నేతలను జాతీయ రాజకీయాల్లో ఉపయోగించు కోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛత్తీస్ గఢ్, కర్ణాటక, బిహార్, ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో నేతలతో జాతీయ పార్టీ గురించి ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
ఇక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలో ఎవరూ సీఎంగా ఉంటారనేది ప్రజలతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయంశంగా మారింది. దీంతో KCR కుమారుడు కేటీఆర్ సీఎంగా ఉంటారని ఇప్పటికే మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం KTRకు సీఎంగా చేసే అర్హత లేదని ఆరోపిస్తున్నారు. TRS పార్టీలో కేటీఆర్ కంటే హరీశ్ రావు సమర్థవంతమైన నాయకుడని మరికొంత మంది అంటున్నారు. కేసీఆర్ తర్వాత ఎవరూ సీఎంగా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.