తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీని కాస్త… బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. జాతీయ పార్టీ కావడంతో… తీసుకునే నిర్ణయాలన్నీ ఢిల్లీ నుంచే జరగాలని ఆయన భావిస్తున్నారు. అందుకే.. ముందుగానే అక్కడ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని డిప్లొమాట్ ఎవెన్యూలో కౌటిల్య మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్లకు సమీపంలోని ఎస్పీ రోడ్డులో బీఆర్ఎస్ ఆఫీస్కు ఒక పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నారు. సొంత కార్యాలయం కొద్ది నెలల్లో ఏర్పాటు కానుండగా.. అప్పటి వరకు అద్దె భవనంలోనే కార్యకలాపాలు నిర్వహించేందుకు నేతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అద్దె భవనాన్ని పెయింట్లతో మెరుగులు దిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే పార్టీ నేతలు అక్కడి రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరిపేందుకు వీలుగా ఈ బంగళాను వినియోగించుకోనున్నారు. కేసీఆర్ నెలాఖరిలోగా ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ చాలా పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారు. మరి ఈ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.