»Karnataka Why Should I Be Upset Dk Shiva Kumar Questioned
Karnataka సీఎం పదవి రాలేదనే బాధ లేదు: డీకే శివ కుమార్
తనను సీఎంగా నియమించకపోవడంపై డీకే గురువారం స్పందించారు. ‘సీఎం ఎంపిక అంశం మొదటి నుంచి అధిష్టానానికే వదిలేశాం. వారు ఆ మేరకే నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే.
ఎట్టకేలకు కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఖరారు అయ్యారు. ఎల్లుండి ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే పార్టీని ఒంటి చేత్తో గెలిపించి ముఖ్యమంత్రి కావాలని కలగన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar) మాత్రం వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన తన పట్టు వీడారు. ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవితో సరిపెట్టుకోనున్నారు. అయితే తాను సీఎం కాలేదనే బాధ తనకు లేదని డీకే చెప్పుకొచ్చారు. ఇంకా చాలా దూరం ప్రయాణం మిగిలి ఉందని పేర్కొన్నారు.
ఈనెల 10వ తేదీన జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 224 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 135 ఎమ్మెల్యేలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే సీఎంగా ఎవరవుతారనే దానిపై వారం రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. సీఎం పదవిని డీకే శివ కుమార్, సిద్ధరామయ్య ఆశించారు. చివరకు అధిష్టానం (Highcomand) నిర్ణయానికి కట్టుబడి డీకే వెనక్కి తగ్గారు. దీంతో వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనను సీఎంగా నియమించకపోవడంపై డీకే గురువారం స్పందించారు. ‘సీఎం ఎంపిక అంశం మొదటి నుంచి అధిష్టానానికే వదిలేశాం. వారు ఆ మేరకే నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. సీఎం ఎంపిక (CM Candidate) విషయంలో పార్టీ నిర్ణయం తుది తీర్పులాంటిది. మనలో చాలా మంది కోర్టులో వాదిస్తూ ఉంటారు. కానీ చివరకు న్యాయమూర్తి చెప్పిన దాన్ని వింటాం. అదే విధంగా ఇక్కడ నేను పార్టీ హైకమాండ్ తీర్పును అంగీకరిస్తున్నా’ అని పేర్కొన్నారు.
ఇక తదుపరి కార్యాచరణపై.. తమ ముందు ఉన్న మార్గంపై శివ కుమార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘కర్ణాటకలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోయి ఉంటే పరిస్థితి ఏమై ఉండేది? కానీ మేం గెలిచాం. కాబట్టి దాని ఫలాలను అందుకోవాలి. ఇది నా ఒక్కడి విజయం కదు. లక్షలాది మంది కార్యకర్తల శ్రమ దాగి ఉంది. వారి వైపు నుంచి కూడా ఆలోచించాలి. ప్రజలు ఇంత భారీ విజయాన్ని అందించినప్పుడు కచ్చితంగా ఆనందించాలి. ఇచ్చి హామీలు (Promises) నెరవేర్చాలి. ఇదే మా ప్రధాన అజెండా’ అని కాబోయే ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉంటూనే పార్టీ రాష్ట్ర బాధ్యతలను (KPCC) కూడా డీకే నిర్వహించనున్నారు.