జార్ఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారంటూ తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
jharkhand train accident : జార్ఖండ్లో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది వరకు మృతి చెందినట్లు గత రాత్రి వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని రైల్వే అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం జార్ఖండ్(jharkhand)లోని జంతారా జిల్లా కళా ఝారియా రైల్వే స్టేషన్ వద్దకు రైలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొందరు వ్యక్తులు రైలు పట్టాలపై నిలబడి ఉన్న సమయంలో వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.
అసాన్సోల్ – ఝాఝా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు(train) ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కాలాజహరియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న ఓ రైలు నుంచి కొందరు ప్రయాణికులు కిందికి దిగి పట్టాలపై నిలబడ్డారని తెలుస్తోంది. అప్పుడే మరో రైలు పట్టాలపై పరుగులు తీయడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
పోలీసులు, వైద్య బృందాలు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పలువురు క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం కొందరు క్షతగాత్రులను దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రులకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్యపై భిన్న వార్తలు వెలువడుతుండటం గమనార్హం.