UP Train Accident : చండీగఢ్ – డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ ప్రమాదం(TRAIN ACCIDENT) చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 33 మందికి గాయాలు అయ్యాయి. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెనువెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
గురువారం మధ్యాహ్నం ఈ రైలు(DIBRUGARH EXPRESS) చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌కు బయలుదేరింది. యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు దగ్గరలో ఉన్నట్లుండి రైలు పట్టాలు తప్పింది. నాలుగు ఏసీ బోగీలు సహా మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలు దిగి కేకలు వేస్తూ పరుగులు తీయడం ప్రారంభించారు.
ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లనూ ఏర్పాటు చేసింది. ఆ వివరాలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రమాదం జరగడంతో కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారు ఒక్కొక్కరికీ రూ.2.5లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించింది.