»Kolkata Bound Kanchanjunga Express Hit By Goods Train In Bengals Siliguri
accident : కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు.. ఐదుగురు మృతి
కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ని ఓ గూడ్సు రైలు ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
Train accident : కోల్‌కతా దగ్గర సిలిగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన గంగ ఎక్స్‌ప్రెస్‌ను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పలువురికి గాయాలు అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు న్యూజల్పైగురి స్టేషన్ నుంచి ప్రారంభమై సాల్దా స్టేషన్ వైపు ప్రయాణమైంది. ఆ సమయంలో గూడ్స్‌రైలు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
గూడ్స్ రైలు సిగ్నల్‌ని పట్టించుకోకుండా వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. రెండు రైళ్లు వేగంగా ఢీకొనడంతో ఒక రైలు పెట్టెలు ఏకంగా మరో రైలు పై భాగంలోకి చేరాయి. దీంతో సంఘటన తీవ్రత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సహాయక సిబ్బంది, వైద్యులు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.
ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని తాను షాక్‌కి గురైనట్లు చెప్పారు. దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. వైద్యులు, అంబులెన్సులు, విపత్తు బృందాలను సంఘటన స్థలానికి పంపించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీసులు, ఎస్పీ తదితరులు అక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.