విజయనగరం రైలు ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. బాధితులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కంటకాపల్లి వద్ద జరిగిన ఈ రైలు ప్రమాద బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు విశాఖపట్నంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
కంటకాపల్లి వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జవ్వడంతో క్రేన్ సాయంతో బోగీలను తొలగిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి 7 సహాయక బృందాలు శ్రమిస్తూ ఉన్నాయి. ఓ వైపు బోగీల తరలింపు, మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో 11 బోగీలను అలమండ స్టేషన్‌కు తరలించామన్నారు.
ఈ ప్రమాద ఘటన తర్వాత కేంద్రం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యల్లో దక్షిణ మధ్య రైల్వేతో పాటుగా వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్ఫీఎఫ్ విభాగాల సిబ్బంది పాల్గొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ రైలు ప్రమాద ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం పిలుపునిచ్చింది. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా అధికారులు నిర్ధారించారు.
అలాగే విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ రైలు సిగ్నల్‌ను ఓవర్ షూట్ చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే డెడ్ స్లోగా వెళ్లాలన్న సిగ్నల్‌ను లోకో పైలట్ గమనించలేదని, వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం జరగలేదని రైల్వే నిపుణులు స్పష్టం చేశారు.