»Elephant Rumbling At Parvathipuram Railway Station
Elephant : పార్వతీపురం రైల్వేస్టేషన్లో ఏనుగు హల్చల్..బెంబేలెత్తిన ప్రజలు
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ఒంటరి ఏనుగు వీధుల్లో తిరుగుతూ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే ఏనుగు పలు గ్రామాల్లో ఆస్తి నష్టం కలిగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
మన్యం జిల్లా పార్వతీపురం(Parvathipuram)లో అర్ధరాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఆ తర్వాత అది పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్లోకి వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. కాగా ఒంటరి ఏనుగు (Elephant) రైల్వేస్టేషన్లో ఉన్నంత సేపూ రైల్వే అధికారులు, సిబ్బంది భయపడిపోయారు. స్టేషన్లోని వారి వారి గదుల్లోనే ఉండిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆందోళన చెందారు. ఆ సమయంలో రైల్వే ట్రాక్ గుండా ఏనుగు సంచరించినా, ఏ రైలు అయినా ఢీకొన్నా భారీ ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే వేకువజామున నాలుగు గంటల సమయంలో ప్లాట్ ఫారం (Platform) నుంచి ఏనుగు కొమరాడ మండం అర్తాం గ్రామం వైపు వెళ్లిపోయింది. దీంతో ఇటు పట్టణ వాసులు, అటు అటవీ, రైల్వే శాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల క్రితం వరకు జిల్లాలో 8 ఏనుగులు గుంపుగా తిరిగేవి. వీటిలో ఏడు గరుగుబిల్లి మండలంలోని గొట్టివలసలో సంచరిస్తున్నాయి. ఏనుగులను పర్యవేక్షించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలోకి ఒంటరి ఏనుగు ప్రవేశించకుండా ఫారెస్ట్ సిబ్బంది (Forest Officers) నియంత్రించకపోవడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో ఒంటరి ఏనుగు అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.