Anant Ambani Wedding: స్థానికంగా ఉన్న 51 వేల మంది ప్రజలకు భోజనం పెట్టడంతో భారతీయ సంపన్నుడు ముకేశ్ అంబానీ పుత్రుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామం ఈ వేడుకలకు వేదిక అయ్యింది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చెంట్ల(Radhika marchent) వివాహం వచ్చే జూలై 12న జరగనుంది. ఈ పెళ్లి ముందుస్తు వేడుకలను మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జామ్నగర్లో నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలకు స్థానికంగా ఉన్న ప్రజలందరినీ భోజనానికి ఆహ్వానించారు. దీంతో దాదాపుగా 51 వేల మంది బుధవారం రాత్రి విందును ఆనందంగా స్వీకరించారు. సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అక్కడ వడ్డించారు. ఈ విందులో స్వయంగా ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు కూడా వడ్డన చేసి అందరి నుంచీ ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాధికా మర్చంట్ అమ్మమ్మ, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ భోజనాల కార్యక్రమం ఇక్కడ కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.
విందులో పాటుగా అక్కడ సంప్రదాయ జానపద సంగీతాన్ని వినిపించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గఢ్వీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశాల నుంచి దాదాపుగా 1000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఆహ్వానాలు అందిన వారిలో ఇవాంకా ట్రంప్, జుకర్బర్గ్, బిల్గేట్స్, సుందర్ పిచాయ్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు ఉన్నారు. వీరందరికీ వడ్డించడానికి దాదాపుగా 2500 వంటకాలను సిద్ధం చేస్తున్నారట. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.