2024లో జమిలి ఎన్నికలు సాధ్యంకాదని లా కమిషన్ (Law Commission) వెల్లడించింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అని తెలిపింది. జమిలి (Jamili) నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ (Justice Ritu Raj) అవస్థిగత ఇటీవల వెల్లడించారు.పూర్తి నివేదికకు కొంత సమయం అవసరమన్నారు. ప్రస్తుతం నివేదిక తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు. మరోవైపు, జమిలి నిర్వహణకు రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించనుందని ఆ వర్గాల సమాచారం.
జమిలి ఎన్నికల నిర్వహణపై 2022 డిసెంబర్ 22న లా కమిషన్ ఆరు ప్రశ్నలను జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు (Bureaucrats), విద్యావేత్తలు, నిపుణుల ముందు ఉంచింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుపుతున్న లా కమిషన్, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తమ నివేదకను పబ్లిష్ చేయనుందని, కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించనుందని వార్తలు వస్తున్నాయి.ఈ ఎన్నిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యానెల్‌ని కూడా నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Kovind) ఈ ప్యానెల్‌కి నేతృత్వం వహిస్తున్నారు.
ఈ ప్యానెల్ కూడా ఇటీవలే భేటీ అయింది. ఇందులో ఏం చర్చించారన్నది బయటకి తెలియలేదు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah), కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి(Sanjay Kothari), న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.