»Massive Blast 34 People Killed And 130 People Injured Balochistan
Massive blast: 34 మంది మృతి, 130 మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు సమీపంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృత్యువాత చెందగా..మరో 130 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
Massive blast 34 people killed and 130 people injured balochistan
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ముహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ర్యాలీగా తరలివస్తున్న సమయంలో ఇది జరిగింది. ఈ ఆత్మాహుతి పేలుడులో దాదాపు 34 మంది మరణించగా..మరో 130 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఆ క్రమంలో ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నవాజ్ గష్కోరి కూడా మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ సందర్భంగా రెస్క్యూ టీమ్‌లను ఇప్పటికే అప్రమత్తం చేశామని బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించామని, అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు బలూచిస్తాన్‌లో శాంతిని నాశనం చేయాలని చూస్తున్నారని అచక్జాయ్ అన్నారు. మరోవైపు పేలుడుకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ డోమ్కీ అధికారులను ఆదేశించారు. అయితే పేలుడుకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఒక ప్రకటనలో వారి ప్రమేయాన్ని ఖండించింది.